పుట:హరివంశము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

హరివంశము


యువిధం బించుక గల్గె నేని విను చిత్రోపాయసంధాయినై
భువనాభ్యర్చిత యొండుచంద[1]ముల నొప్పుల్ దెత్తు నీమూర్తికిన్.

190


చ.

అనుటను నవ్విధంబునకు నంబుజబాంధవుఁ డియ్యకొన్న నా
తనిపటుదీప్తిమండలి ముదంబున నుగ్గమునం దమర్చి వే
తునియఁగ [2]ద్రచ్చెఁ జిత్రకృతిధుర్యుఁడవార్యజగత్మాప్రమోదవ
ర్ధనుఁడు సురేంద్రవర్ధకి యుదంచితతేజము ద్రెస్సి రాలఁగన్.

191


వ.

ఇట్లు కిరణంబు లెల్ల [3]1నురివి డుల్లి విన్ననైనం [4]గాంతిమాత్రదేహుండై పద్మినీ
కాంతుండు నిజకాంత యున్నరూపంబు యోగదర్శనంబునం గన తానునుం
దురంగమూర్తియై యచ్చటి కరిగి కదియుటయు [5]3నమ్మగువ యన్యపురుషుం
డనుతలంపునఁ బిఱుఁదు డాఁచి యడఁగుటయు నిరువురనాసాపుటంబులు మోచిన
[6]నాసత్యులు పుట్టిరి. తనంతరంబ.

192


శా.

ఆరూపం బటు వాసి నైజతను వింపారంగఁ దాల్పంగఁ [7]జే
తోరాగంబున [8]నవ్వెలంది నిజనాథున్ గాంచి తా నీశు
కారం బేర్పడి నిల్చె నయ్యిరువురుం గామోపభగక్రియా
ధౌరేయం బగునుజ్జ్వలోత్సవమునన్ ధన్యాత్ములై రెంతయున్.

193


వ.

ఆవివస్వంతుండు తనయగ్రపుత్రుం డగువైవస్వతునకు సప్తమమన్వంతరాధి
పత్యం బొసంగె. యముండు నిజధర్మవివర్ధనంబున ధర్మరావజనువిఖ్యాతియు
మహత్త్వంబునుం గనియె. సౌవర్ణుం డిటమీఁద నష్టమమనుభావంబు భజియింపం
గలవాఁడై మేరుశిఖరంబునందు గరిష్ఠ యగు తపోనిష్ఠ [9]వసియించియుండె. శనై
శ్చరుండును గ్రహపదవిం బ్రదీప్తుండై నిలిచె. [10]యమున మహానదియై లోక
పావనస్ఫూర్తిం బ్రవర్తిల్లెఁ. దపతి సంవరణుం డనురాజునకు రమణియై భారతవంశ
[11]ప్రదీపకరం బగునపత్యంబులుం బడసె. నాసత్యు లాశ్వినేయు లన నమరులకు
వైద్యులై యనవద్యవిద్యాగరిమంబునం బెంపొందిరి. బృందారకశల్పియు ననల్పం
బగుతపనతేజోరజఃపుంజంబున నజునకు నప్రతిమానవిమానంబును దానవధ్వంసికిఁ
బ్రశంసనీయవిక్రమం బగు చక్రంబును ఫాలలోచనునకు నాభీలం బగుశూలంబును
రచియించె. నిట్లు కీర్తితం బైన.

194


క.

ఈదేవజన్మకథ న, త్యాదరమున వినినఁ బ్రీతులై చదివిన స
మ్మోదంబున వ్రాసిన ల, క్ష్మీదీర్ఘాయువులు సుసమృద్ధియుఁ గలుగున్.

195


క.

అని జనమేజయవిభునకు, మునివైశంపాయనుండు మును పరిపాటిన్
వినుపించినకథ యంతయు, ననుపమచారిత్ర యన్నమాంబాపుత్రా.

196
  1. మిల నొప్పుంజేయ
  2. వ్రచ్చె
  3. నుఱవు
  4. శాంతి
  5. నది
  6. దస్రులు
  7. తేజో
  8. బొంది కాంతయు నిజేశున్
  9. నధిష్టించి
  10. నయ్యమున
  11. ప్రదీపకులగు