పుట:హరివంశము.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

530

హరివంశము

క. అని చెప్పిన వైశంపా, యనువాక్యము హృషిత మైనయంగ మెలర్పన్
     గొనియాడి యతని కభ్య, ర్చనఁ జేసెఁ బరీక్షిదాత్మజన్ముఁడు ప్రీతిన్.345
క. మీరును బారాశర్యో, దారఫణితియందుఁ గల్గుతాత్పర్యంబున్
     ధీరము లగుచిత్తంబులఁ, జేరిచి యానందసిద్ధిఁ జెందుఁడు నియతిన్.346
వ. శ్రీమహాభారతంబు హరివంశోత్తంసంబుగా నఖిలంబును యథాశ్రుతవ్యాఖ్యా
     నంబుగాఁ జేసి మిమ్ము నారాధింపం గలిగె నే ధన్యుండనైతి ననిన నారౌమహర్షణి
     వలనం బరితోషంబు నొంది.347
ఉ. శౌనకుఁ డాదిగాఁ గలుగు సంయమిపుంగవు లందఱున్ బ్రమో
     దానుభవంబుస బొదల నాంతరబాహ్యవిచేష్టికంబు లిం
     పై నెఱయంగ నక్కథకు నంచితకీర్తనపూర్వభూరిస
     న్మానములం బ్రహర్షమయమానసుఁగా నొనరించి రున్నతిన్.348
క. శ్రీ వేమక్ష్మావల్లభ, భూవల్లభపూజనీయ భుజవైభవ ల
     క్ష్మీవల్లభ గుణవితరణ, పావన నినుఁ బొందుఁగాత భవ్యశుభంబుల్.349
గద్యము. ఇది శ్రీ శంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
     ప్రణీతం బైన హరివంశంబునం దుత్తరభాగంబునందు సర్వంబును దశమా
     శ్వాసము.