పుట:హరివంశము.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము-ఆ. 10.

529

క. తదనంతరంబ యందఱ, నొదవఁగ హృద్యాన్నపానయుక్తిఁ బ్రమోదో
     న్మద మమరఁ జేసి వాచకుఁ, బదిలంబుగ భవ్యపూజఁ బాటింపఁ దగున్.331
తే. పసిఁడిచీరలు గోవులుఁ బసులు గొల్చు, నూళు లిండ్లును బండ్లును నోలి నొసఁగ
     వలయు నివియెల్ల నొసంగి యవ్వలన మోడి, సేయ కెంతయు సంతుష్టి సేయవలయు.332
క. వాచకుఁడు సంతసిల్లిన, నాచతురాననునిఁ దొట్టి యమరవరులు భ
     వ్యాచారతుష్టి నొందుదు, రాచంద మొనర్ప నిచ్చు నభ్యుదయంబున్.333
తే. అనఘ వాచకుఁ డెట్లట్ల యర్హుఁ డఖిల, మునకు నా లేఖకుండుఁ దద్భూతితోడ
     నిష్టశుభదంబు సభ్యుల నెల్ల నీగి, వలన నలరించి దీవన వడయవలయు.334
క. భారతపంచమవేద, ప్రారంభమునపుడుఁ దత్సమాప్తిని వలయున్
     ధీరమతిని బహువిప్రస, మారాధన మది మహార్థి నాపాదించున్.335
క. నీవడిగినవిధ మంతయు, భూవర చెప్పితి నజస్రమును గోప్యముగా
     భావింపు మవ్విధము స, ద్భావుల కెఱిఁగింపవలయుఁ దగ దితరులకున్.336
క. భారతము నిర్మలప్రతి, భారతమున్ వినినపఠనపరులకు శుభవి
     స్తారము రవిశశితారక, తారకము తదీయపితృపితామహతతికిన్.337
క. వినవలయుఁ జదువవలయును, గొనియాడఁగవలయు నధికగోప్యార్థముగా
     నునుపఁగవలయును మనమున, మనుజోత్తమ భారతాఖ్యమహితాగమమున్.338
ఉ. భారతపుస్తకప్రతతి పాయక యేసుకృతాత్మునింట నొ
     ప్పారుచు నిత్యపూజనల నందుచు నుండు దదీయవాసముం
     జేరి తలిర్చునిష్టజయసిద్ధి నిజంబు పురాణపూరుషా
     ధారకథామయం బగుటఁ దత్సదృశంబులె యొండుగ్రంథముల్.339
క. మనుజులు గొనియాడవలయు, నని చెప్పుట గొఱుఁతయే మహామునులు సురల్
     వనజజుఁ డాదిగ భారత, మనిశముఁ జదువుచును వినుచు నలరుదురు మదిన్.340
తే. భారతశ్రుతిరతులకు భవ్యయాన, దివిజసుఖములు సులభంబు లవుట యరుదె
     ముక్తిపదము తదీయాంగమునను గల్గుఁ, దత్కథామూర్తి విష్ణుకీర్తనముగాదె.341
క. భారత గోవు విప్రుఁడు, భారతియును జాహ్నవియును బద్మావిభుఁడున్
     గోరి నిరంతరచింత్యులు, గా రూపించు సుజనుండు కల్యాణి యగున్.342
క. శ్రుతియును భారతమును రఘు, పతిచరితముఁ జదువు వారు పరమపురుషు న
     చ్యుతు మొదల నడుమఁ దుదిఁ బ్ర, స్తుతి సేయఁగవలయు విప్రచోదిత మొందన్.343
ఉ. ఏకథయందు విష్ణు జగదీశ్వరు నాద్యు ననంతు నంచిత
     శ్లోకవరేణ్యుఁగాఁ దెలుపు సూక్తులు చాలఁగఁ గల్గుఁ బన్నుగా
     నాకథ విస్తరింపఁ దగు నాకథ వీనులఁ గ్రోలఁగాఁ దగున్
     శ్రీకరసద్గుణాకరవిశేషత యీకథ కౌరవోత్తమా.344