పుట:హరివంశము.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 10.

521

తే. తురగ మగ్నిమయంబు తత్తురగమేధ, యజనమున బ్రహ్మహత్యాదులైన కడిఁది
     పాతకంబులు చెచ్చెర భస్మసాత్కృ, తంబు లగు నని వేదవాక్యంబు గలదు. 249
చ. అనఘ మనుష్యులందు వసుధామరుఁడుం జతురాశ్రమంబులం
     దును గృహమేధిధర్మమును దుర్దమదైవతదైత్యకోటియం
     దనుపమసత్వవైభవసమగ్రుఁడు నింద్రుఁడువోలె నశ్వమే
     ధనియమ మెల్లయజ్ఞసముదాయమునందును మేటి యారయన్.250
వ. ఇట్టి మహాధ్వరంబునందు దీక్షితుండ వై సర్వాపేక్షాపూరణవ్రతంబున నున్న
     నిన్ను నర్థించువారలు సకలార్థసమృద్ధు లగుట యేమి చోద్యం బనిన విని సంతసిల్లి
     బలీంద్రుం డవ్వామనదేవు నాలోకించి యల్లన నవ్వుచు.251
క. కఱుదులమాటల మమ్ముం, గుఱుచవడుగ యేల యింత గో నెక్కింపన్
     నెఱయఁగ నీయిష్టము మా, కెఱిఁగింపుము వేడ్క నిత్తు మెయ్యది యైనన్.252
వ. అనివ నతం డేను గుర్వర్ణం బర్థినై వచ్చితిఁ బదత్రయమాత్ర యగు ధాత్రి
     యిచ్చినం జాలుఁ గృతకృత్యుండ నగుదు ననవుడు నవ్వితరణకోవిదుం డవ్వేద
     విదునితోడ.253
తే. చదువుదురుగాన విప్రులు చాలముగ్ధు, లకట యివి యేమి బుద్ధి మూఁడడుగు లడుగు
     టేను శతలక్షపదమాత్ర యైనధన్య, ధరణి యిచ్చెదఁ గొను మొండుతలఁపు దక్కి.254
చ. అనునెడ శుక్రుఁ డాదితికులాగ్రణిఁ జేరఁగవచ్చి యొయ్య ని
     ట్లను నిది యేల వేగపడ నద్భుతకృత్యరతుండు దైత్యసూ
     దనుఁ డిటు వంచనన్ సురహితం బొనరింపఁగ వచ్చినాఁడు నీ
     మనమున నీఁగిపైఁ గడఁక మానుము సూడకు మింక నీతనిన్.255
క. ఏమి యొనరింపఁ బోయిన, నేమి యగునొ మనకు నేల యీతొడుసులు నా
     నామూర్తిధరుఁడు హరి మా, యామయుఁడన వినమె యంచితామ్నాయములన్.256
వ. అని చెప్పిన నొక్కింత చింతించి యసురవర్యుం డాచార్యుం గనుంగొని.257
సీ. ఇచ్చెద ననఁ గాని యీలే ననంగ నేరని నోరు దైన్యాక్షరములు వలుకు
     టఖిలంబునకును మీఁదయి యొప్పు హస్త మీగికిఁ జాఁపగాఁ గడుఁ గ్రిందువడుట
     నిత్యస్వతంత్రాదినిరతిఁ జెన్నగుమోము వేఁడుకష్టత వెలవెల్ల నగుట
     సర్వలోకములకు సంశ్రయ మగు మేను యాచకభంగి భయమున వడఁకు
తే. టద్భుతం బిట్టిఁడయి వచ్చి యబ్జనాభుఁ డర్థి యగునటె దాత నే నగుట యరుదె
     కలఁడె హరికంటెఁ బాత్ర మీఁ గంటి మంటి, నిత్తు నివ్వామనునికోర్కి యెల్లభంగి.258
క. తమతమవిద్యాతపముల, యమితఫలము లెవ్వరికి సమర్పించి మహ
     త్త్వము వడసి రాద్యు లవ్విభుఁ, బ్రముదితుఁ జేయుటయ కాదె భాగ్యము మనకున్.259