పుట:హరివంశము.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 10.

517

     రిక్త ముక్త శుద్ధ బుద్ధావతారతాభాస! భాసమాన మధ్యమ మార్గ
     మసృణమౌని మనోమార్గ! మార్గణ భుజంగ పీతాసురాసు పవమాన!
     మాననీయ మహిమానంద నంద దిందిరా సుందరీ హృషీక ! హృషీకేశ!
     కేశవ! నమస్తే నమస్తే నమస్తే నమః.211
శ్లో. నమః కైవల్యకల్యాణకల్యానందవిధాయినే
     నారాయణాయ మహతాం వరదాయ వరీయసే.212
క. అని వినుతించినఁ గశ్యప, మునిదెసఁ బ్రీతుఁ డయి విశ్వమూర్తి ముకుందుం
     డనుపమధీరధ్వని ని, ట్లనియె నభోవీథి నిలిచి యంతర్హితుఁడై.213

నారాయణుఁ డదితిగర్భంబున వామనుం డయి జనియించెడు కథ

చ. అమలచరిత్ర నీవు నియతాత్ముఁడ వైనతెఱంగు నీయను
     త్తమ మగువాక్ప్రపంచమును దైవతవర్గము భక్తితోడ సం
     యమమతి నున్నచందము మదాత్మకుఁ బ్రీతి యొనర్చె వేఁడు మి
     ష్ట మయినయర్థ మవ్విధము సర్వజగత్ప్రియ మెవ్విధంబునన్.214
వ. అనినం గశ్యపమునీంద్రుండు దేవా దేవర మావలనం బ్రసన్నుండ వైతేని
     నింద్రానుజుండ వై సకలబృందారకబృందంబులకు నానందప్రదం బగు నవతా
     రంబు నంగీకరింపవే యనియె నదితియుం బ్రాంజలి యై పరమేశ్వరాదేశంబున
     నాకాశంబుఁ జూచి నమస్కరించి.215
క. నాకపతికిఁ బెంపొదవఁగ, నాకంపితులై సురారు లడఁగఁగఁ గృపతో
     నాకడుపు చల్లనయ్యెడు, నాకారముతో జనింపవయ్య ముకుందా.216
చ. అనునెడ దేవతావరులు నంబరలంబివిలోచనాంశులై
     మనములు భక్తిపూరపరిమగ్నములై యలరంగ దేవ నీ
     వనుజత నొంది దేవవిభునయ్యయు నేలికయున్ గురుండు వే
     ల్పును శరణంబునై భయవిలోప మొనర్చి యనుగ్రహింపవే.217
క. నీ వదితిసుతుఁడ వగుటయు, దేవత లందఱును దేవదేవ ధ్రువముగా
     దేవాహ్వయంబు దాల్తురు, నీవాత్సల్యంబు గోర్కి నెఱయఁగఁ బడదే.218
వ. అని యివ్విధంబున నందఱు నభ్యర్థించిన నేకవాక్యనిరూపితం బగు మతంబు
     మనంబున నవధరించి మధుమథనుండు మధురస్వరంబున వారి కి ట్లనియె.219
క. భరితతపస్కులు గశ్యప, వరమునియును నదితియును ధ్రువంబుగ నే ని
     య్యిరువురోర్కియు నిండఁగ, హరిహయసౌందర్యసుఖము నందెదఁ బ్రీతిన్.220
మ. క్రతుభాగంబులు గోలుపోయి కృశులై కాతర్యముం బొంది యే
     గతియుం గానక యిట్లు దూలెడుసురల్ కల్యాణబుద్ధుల్ ధృత
     వ్రతు లెబ్భంగి నిరీక్షణీయులుగ భావస్ఫూర్తి నేఁ జూచితిన్
     దితిజుల్ నాకెదురే జయింతు నఖిలద్వేషివ్రజంబున్ వెసన్.221