పుట:హరివంశము.pdf/561

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 10.

513

వ. చని యతనితో నీవు సర్వామరస్వామిని ధాతవు విధాతవు నై భూతంబుల
     రక్షించుపనికిఁ బూని యున్నాఁడవు మూఁడు జగంబుల నీకు సమానుం డగుమాన
     ధనుండు లేఁడు సైన్యంబులు గలంగి పాఱెడు దొరలయందు నిపాతితద్విరదుం
     డును నిహతహయుండును నిర్మధితరథుండును నికృత్తాయుధుండునుం గానివానిం
     బొడగాన మేము నీమఱువు సొచ్చితిమి సముత్సాహంబున కిది సమయంబు కడిమి
     వాటింపుము కడంగుము.177
క. శూరుఁ డగువాఁడు బాహా, ధౌరేయత నాత్మసంశ్రితప్రతతిఁ గడుం
     బోరామిఁ గావకుండినఁ, బేరు గలఁడె డక్కునయ్య ప్రియజయలక్ష్ముల్.178
సీ. అనుటయు నట్లకా కని సహస్రాక్షుండు హయసహస్రోపేత మైనరథము
     మాతలిసారథ్యమహిమాభినీతమై తనరారురత్నకేతనము వెలుఁగ
     దివ్యకిరీటదీధితులతోఁ గర్ణికాంగదహారకుండలకంకణాంగు
     ళియకద్యుతులు దలిర్ప సంధ్యాతపం బఖిలదిఙ్ముఖముల నావహింప
తే. సన్నిహితవజ్రుఁడును హస్తసంగృహీత, కార్ముకుండు నక్షయతూణకల్పనుండు
     నగుచుఁ జరణకీర్తన లతిశయిల్ల, నేచి దైత్యనాయకునకు నెదురు నడచె.179
క. బలియును హరిఁ గన్నంతన, బలవన్నారాచపటలపరిపిహితదిశా
     వలయుఁ డగుచుఁ దోతేరఁగఁ గలహం బిరువురకు నయ్యెఁ గడుఁ జోద్యముగాన్.180
క. ఆతెఱఁగుకయ్యములు ము, న్నేతఱిఁ జూచియును వినియు నెఱుఁగ రతివచ
     శ్చేతోవిషయము దత్సమ, ఘాతము త్రైలోక్యభీతికంపన మెందున్.181
తే. చేరి ప్రహ్లాదముఖులు ప్రసిద్ధబుద్ధి, ధుర్యు లగ్గింప బలి బాహుదోహలంబు
     సిద్ధమునికోటి గొనియాడ జిష్ణుబలము, వర్ధనము నొందెఁ దమలోన వట్రపడక.182
మ. బలిబాణావలి నింద్రుఁ డింద్రువిలసద్బాణాళిఁ దోడ్తోన యా
     బలి ద్రెవ్వన్ పడి నేయనేయఁ దునుకల్ బ్రద్యోతమానాకృతిన్
     శలభశ్రేణులుఁ బోలె మూసె దెస లుత్సాహంబునం బొందె న
     గ్గలికల్ మీఱినతూపు లొండొరులఁ జిక్కం దాఁకె మర్మస్థలుల్.183
క. నెఱఁకులు దాఁకినయమ్ములఁ, జొఱఁజొఱ నెత్తురులు వడియ శోభిల్లిరి వా
     రెఱసంజు మీఁదఁ బర్వఁగ, గుఱియై యొప్పారు క్రొత్తకుధరములక్రియన్.184
క. ప్రకృతిశరంబుల నిరువురు, నొకవడిఁ బోరాడి యుడిగి యుద్ధతదివ్యా
     స్త్రకళాగర్వము లప్పుడు, ప్రకటించిరి రౌద్రచిత్రభంగులు వెలయన్.185
తే. తనకుఁ గలలావు లన్నియుఁ దరతరంబ, యహితుదెసఁ జేసి చూపి యనంతరంబ
     హరిహయుండు ప్రయోగింతు నని తలంచె, నఖిలశైలపక్షాఘాతి యైనహేతి.186
వ. ఇవ్విధంబున నుత్సహించి ప్రయత్నపూర్వకంబుగా నమ్మహాయుధంబు కరంబున
     నమర్చునంతలోన నంతరిక్షంబున నశరీరవాణి యతని కి ట్లని వినిపించె.187