పుట:హరివంశము.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

508

హరివంశము

మ. యమసైన్యంబులచేత దానవులు దైత్యానీకదర్పంబునన్
     శమనాగ్రేసరులున్ విభగ్నవిహతస్రస్తావధూతక్షత
     భ్రమితక్షోభితమూర్ఛితావదళితప్రాయాంగులై యాహవ
     క్షమ నెల్లన్ బహురక్తమాంసకలితంగాఁ జేసి రస్త్రావళిన్.134
క. కాలుఁడు దైతేయుండును, గాలాంబుదయుగముభంగిఁ గాంచనమణిచి
     త్రాలగ్నచాపు లయి శర, జాలసలిలవృష్టి గురిసి సలిపిరి రణమున్. 135
మ. శరము ల్తూణముఖంబునం దిగుచుట ల్సంధించుటల్ కర్షణం
     బరుదారంగ నొనర్చుట ల్విడుచుట ల్సాటోపవేగంబులం
     బరికింపంగ వశంబుగాక పరిధీభావంబునం జాపముల్
     పరపం జొచ్చిరి వార లిద్దఱు సమప్రక్రాంతబాహూద్ధతిన్.136
క. పిడుగులగతి నొండొరుపైఁ, బడుబాణంబులయసహ్యపాతంబుల క
     య్యొడళుల యోర్చెంగా కె, క్కడఁ గలుగుం దత్సమానకాఠిన్యంబుల్.137
క. ఎడసొచ్చి యుభయబలములఁ, బొడివొడి సేయుచు దిగంతములు మూఢముగా
     నడరుచు మెఱుఁ గెక్కినరుచు, లడకుచుఁ గఱుకెక్కె వారియస్త్రోద్గమముల్.138
క. లే దేన్నగ మును నేఁడును, లే దిటమీఁదటను లేదు లే దని పోల్పం
     గా దీనికి నెన యని ప్రహ్లాదయములపోరు మెచ్చి రంబరచారుల్.139
వ. అంత నంతకంతకు నంతకుండు పరిశ్రాంతసత్త్వుం డగుచు వచ్చె సత్త్వాధికుం
     డగుట నసురోత్తము మానసశారీరవృత్తంబులు భేదాయత్తంబులు గాకుండె
     నయ్యంతరం బెఱింగి కృతాంతసారథి రథం బపక్రాంతంబు సేసెఁ బ్రహ్లాదుం
     డాత్మగతంబున.140
క. తనువుగలయాత్మ లెల్లన్, దనవశమునఁ దనరుదండధరుఁ డిట్లు విచే
     తనుఁ డయ్యె మద్భుజాఘా, తన కింతియచాలు మేటితన మని యెలమిన్. 141
క. ఆతని వెనుకొన నొల్లక, యాతత మగురథము దేవతానీకముపై
     సూతునిఁ బఱపగఁ బనిచి సు, శాతశరవ్రాతపాతచలితము చేసెన్.142

అనుహ్లాదుండు కుబేరుం దలపడి సంగ్రామంబు భీమంబుగాఁ జేయుట

వ. తదీయానుజుం డగు ననుహ్లాదుండు కుబేరుం దొడరి పోరునెడం బెక్కండ్రు
     యోధవీరులు రథతురంగమాతంగబహుళపతాకినీసమేతంబుగాఁ బతికిం బాసట
     యైన నతం డందఱం దునుమాడి సమరధరణీరుధిరధారావర్షంబున నభిషేకించిన.143
క. కినిసి ధననాథుఁ డాతని, ననవరతశరౌఘమగ్నుఁ డగునట్లుగఁ దా
     నొనరింపగ నరదము డిగి, దనుజుం డొకతరువు వెఱికి దర్పస్ఫూర్తిన్.144
క. పౌలస్త్యురథాశ్వంబులఁ, గూలఁగ వ్రేయుటయు నట్టిఘోరక్రియకుం
     జాలఁగ మెచ్చుచు నుతివా, చాలం బై యార్చె దైత్యసైన్యం బెల్లన్.145


.