పుట:హరివంశము.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

506

హరివంశము

మ. తనసైన్యంబులఁ గాచుచు రథగతుల్ ధాత్రీసముత్కంపముం
     బొనరింపంగ సమిధ్ధహవ్యవహుఁడుం బోలెం బ్రదీప్తాకృతిన్
     దనుజశ్రేష్ఠుఁడు ప్రత్యనీకముల నుద్దామాస్త్రదాహంబునన్
     జనితోద్దాహత నొందఁ జేసెఁ ద్రిగజత్సంక్షోభసంపాదియై.120
ఉ. దేవతలున్ రథాశ్వగజతీవ్రచమూనివహంబుతోఁ గడున్
     లావునఁ బూని దానవకులప్రభుపైణ బటు హేతిదీధితి
     వ్యావృతదిగ్విభాగముగ వారక క్రమ్మిన నాతఁ డుద్భట
     భ్రూవికృతాస్యుఁడై యరదమున్ వెస డిగ్గి భుజాబలోద్ధతిన్.121
వ. ఉదగ్రశాఖం బగు శాఖి యొక్కటి వెఱికి యుఱికి నుఱుపం దొడంగినం దలరి
     దివిజులు దలలు వీడం దొడవు లూడ వలువలు సడల నొడళ్లు వడంక మగుడి
     మగుడి చూచుచుం గనుకని పఱచిరి నిష్కంపుండును జేయునది లేక చూచు
     చుండె వృషపర్వుండు మగుడి రథం బెక్కి.122
క. జ్యారనములు రోదోంతర, పూరణ మొనరింపఁ దీవ్రభూరిశరౌఘం
     బారిపుపై నడరించె మ, హారోషత నతఁడు వేటులాడుచు నుండెన్.123

ప్రహ్లాదుండు సకలసైన్యసమేతుం డై యమునితో మహాయుద్ధంబు చేయుట

వ. ప్రహ్లాదుండు దండధరు నెదుర్చువాఁ డై భార్గవు రావించి విజయావహం బగు
     క్రియానివహం బభ్యర్థించిన నతండు నియతుం డై యభిమతహుతంబుల హుతా
     శను నర్పితుం జేసి యధర్వంబు లగుజప్యంబులు జపియించె నతని శిష్యులు పది
     వేవురు గురుశాసనంబున నఖిలజై త్రమంత్రంబుల నాదితిజపతితేజంబునకు నుత్తేజం
     బొనర్చిరి. తదభిమంత్రితమాల్యభూషణాదుల నలంకృతుం డై విజయాశీ
     ర్వాదంబులు గైకొని యాహిరణ్యకశిపు తనయుండు హిరణ్యప్రముఖప్రభూత
     దానంబుల ధాత్రీదివిజులం బ్రీతులం జేసి రథం బెక్కి తదీయబాంధవులు
     దత్సమాను లనేకు లవ్విధంబునన యనుష్ఠితకల్యాణు లై వచ్చి యమ్మహారథుం
     బరివేష్టించిరి డెబ్బదివేల రథంబులు నన్నియ యేనుంగులు లక్షలకొలందులు
     ఘోటకంబులు నపరిమితపదాతులుం గల బలంబులు మోహరించి యంతటికిం
     గాలనేమి నగ్రణిఁ గావించిన నవ్వీరుండు భేరీసహస్రంబుల శంఖపణవకాహళశత
     సహస్రంబుల నమరు చండస్వనంబుల నజాండంబు పరియ లై పడు ననుభీతి భూతం
     బుల చేతోగతుల నుత్పాదింప నుత్పాతపవనప్రేరణదుర్నివారం బగువారిధి
     యుంబోలె నడచి యిరుగెలంకుల యోధులం గనుంగొని యి ట్లనియె.124
క. కడుఁ బెద్దగాలమున కి, ప్పుడు గలిగెను సురలతోడిపోరు కడు వెసన్
     బొడిచెద నొడిచెద నహితుల, నుడుగక నాచేయి చూచుచుండుఁడు మీరల్.