పుట:హరివంశము.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

488

హరివంశము

     నప్రతిహతప్రభావం బగు పాశుపతంబుం బ్రయోగించిన నయ్యస్త్రంబులన్నియు
     నన్నరమృగేంద్రుం బొదువుటయు ఘర్మసమయంబున ఘర్మాంశుకిరణంబులు
     తుహినశైలంబుం బొదువుచందం బయ్యె నాలోన.226
మ. సకలానీకము పన్ని విష్ణునిపయిన్ సంహారవాత్యాభయా
     నకవేగంబున వచ్చి తాఁకి వరుసన్ సర్వాస్త్రశస్త్రంబులం
     బ్రకటోపాయనికామనిర్భరముగాఁ బ్రక్షిప్తముల్ సేయ న
     య్యకలంకుం డవియెల్ల మ్రింగె వికటవ్యాలోలవక్త్రంబునన్.227

విప్రచిత్తిప్రభృతిదానవులు హిరణ్యకశిపుతోడం గూడి నరసింహదేవునితోఁ బోరుట

చ. ఉడుగక వెండియుం దనుజయోధులు శక్తిశరాదు లోలి ను
     గ్గడువుగ దీటుకొల్పి హరిగాత్రము సర్వముఁ గప్పి యాకసం
     బెడపడకుండఁగాఁ బొదివి యేపున నార్చి నిజేశుచూడ్కికిం
     గడుఁబ్రమదంబు నద్భుతవికాసముఁ గల్గగఁ జేసి రుధ్ధతిన్.228
మ. అలుకం బేర్చి నృసింహుఁ డొక్కమొగి నయ్యస్త్రంబు లుధ్ధూనన
     స్ఖలితస్కంధసటాసమీరునకు మేఘశ్రేణి గావించి య
     వ్వలనం గన్నులగ్రేవలం గనలు తీవ్రజ్వాల లాభీలభం
     గులుగాఁ జూచిన విచ్చె నల్దెసలకుం గ్రొవ్వేది తత్సైన్యముల్.229
వ. అప్పుడు నరమృగేశ్వరు నా దైత్యేశ్వరుం డెదిర్చి యర్చిష్మతి యగు శక్తి
     యొక్కటి వైచిన నతండు దాని నుగ్రహుంకారంబున నడంచి పెలుచం గర్జిల్లిన
     నమరశత్రుండు శరాసనంబు గైకొని నిశాతశరంబు లతనిపైఁ బఱపిన నవి
     క్రొమ్మొనల నలువున నాభీలనలినీకాననంబు కాంతి గగనంబునకుం గలిగించె
     నయ్యుత్సాహంబు గని యటమున్ను చెదరిన దొరలుం గూడికొని.230
తే. పొదలి మాయ నదృశ్యులై చదలనుండి, కొండలంతలురాలు ముకుందుమీఁద
     నూఁడుకొన వైవఁదొడగి రొండొండదెసలు, మూసెఁ బాషాణరోధసముత్థతమము.231
క. అవియెల్లను నానరహరి, యవయవములు సోఁకి యిసుకలై చెడిపోయెన్
     దివిజవిరోధులు మఱియును, వివిధం బగునింద్రజాలవిభవము పేర్మిన్.232
వ. వేదండతుండస్థూలం బగు సలిలధారలు గలిగించి నిరంతరాసారంబు ప్రచండ
     సమీరప్రహారఘోరంబుగాఁ గల్పింప గల్పాంతకాలంబునఁ గాలాంబుదంబు
     లడరి కురిసిన మురిసిపోవుపగిదిఁ బృథివి యెయ్యెడలను వ్రయ్యం జొచ్చె
     నెచ్చోట్లు నెవ్వరికిం దోఁపనీక చీఁకట్లు పర్వి సర్వలోకంబు నాకులంబుఁ జేసిన
     నయ్యుగ్రప్రయోగంబునందు.233
క. ఒకచినుకుఁ జోఁక దవ్విభు, నొకయింతయుఁ దాఁక దనిల మొకలవముం జూ
     డ్కికి నడపడుడదు తిమిరము, వికసితదివ్యప్రభావవిభ్రముఁ డగుటన్.234
ఉ. దానవు లంతఁ బోక పటు దారుణవహ్ని సృజించి తీవ్రవే
     గానిలవర్ధమాన మగునట్లుగఁ జేసి తదీయవిగ్రహ