పుట:హరివంశము.pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

476

హరివంశము

మ. అనుమానింపకు రమ్ము నే ననఘ నీ కాయుఃప్రదుండై తన
     ర్చినదేవుండ నిరంతరంబును సమర్పింపంగ నర్హుండ మీ
     జనకుం డాదిఁ దపం బొనర్పఁ బరితోషం బంది యీ సర్వభూ
     తనికాయక్షితియందుఁ జావనిసుతున్ ధన్యాత్ము ని న్నిచ్చితిన్.118
క. ఇంతటివాఁడవు గా కి, ట్లంతము నాదియును లేని యవ్యయు ననుఁ గ
     ల్పాంతక్రీడారతు ని, శ్చింతతఁ గనుభాగ్య మెట్లు సేకుఱె నీకున్.119
చ. అనుటయు నాతఁ డాత్మ వెగడంతయుఁ బాయఁ బ్రబోధలక్ష్మి గ్ర
     మ్మనఁ దలయెత్త నాద్యు నసమాను సనాతను వాసుదేవుఁ దాఁ
     గని కదియంగఁ బోయి ఘనకౌతుకసంభ్రమభక్తియోగముల్
     పెనఁగొన గోత్రనామములు పేర్కొని నెమ్మి నమస్కరించినన్.120
వ. ఇందు రమ్మని దేవుండు సమధికాధికారంబు సూపుటయుఁ జేరం జని వినమ్రగా
     త్రుం డై కేలు మొగిచి నిలిచి ఫాలస్థలకరణంబు గావించి.121
చ. ఉదరమునందు విశ్వమును నున్నది వెల్పల శూన్య మిమ్మెయిం
     బొదలినమఱ్ఱియాకుపయిఁ బొచ్చెపుబాలుఁడవై వినోదసం
     పద విలసించె దింతటికిఁ బ్రాప్యము నాఁ దగు భూత మీవ కా
     నొదవెదు తర్కమిట్టి దనియున్ దెలియ న్భయమయ్యెడుం దుదిన్.122
క. నను నాశ్రితుఁడుగఁ గైకొని, మనుచుటకుం దగ భవత్సమగ్రవిభవముల్
     గనుతెలివి నిచ్చి నెఱపుము, ఘన మగు నీకరుణపెంపు కారుణికవరా.123

నారాయణుండు మార్కండేయునకు నాత్మప్రభావం బెఱింగించుట

క. నావుడు మున్ను ప్రసన్నుఁడు, గావున నద్దేవుఁ డాత్మగౌరవ మెల్లన్
     వేవిధముల నిట్లని య, ప్పావనచరితునకుఁ జెప్పెఁ బ్రస్ఫుటఫణితిన్.124
తే. అనఘ నారాయణుఁడు నాఁగ నాద్యమైన, దైవశం బేను బ్రహ్మనై తగ నఖలముఁ
     దొలుతఁ గలిగింతుఁ గడపటఁ బ్రళయదహన, చండమూరినై యంతయు సంహరింతు.125
క. క్రతుకోటియెల్లను శత, క్రతుఁ డై చేసితిని గ్రతువు గ్రతుపురుషుఁ డనన్
     నుతిఁ గాంతు హుతవహుఁడనై , హుతములఁ గ్రమభాగరతుల కొసఁగుదుఁ దృప్తిన్.126
ఉ. వేయుకరంబులన్ వెలిఁగి విశ్వజగంబు వెలుంగఁ జేయుదున్
     వేయుశిరంబులం దనరి విశ్వజగంబును దాల్తుఁ దాలిమిన్
     వేయుపదంబులుం గలిగి విశ్వజగంబున కిత్తు సంస్థితిన్
     వేయుముఖంబులన్ బరఁగు విద్యలు ధర్మము లస్మదాకృతుల్.127
క. [1]క్రియయును క్రియాఫలంబును, గ్రియారహితపురుషుఁడును బ్రకృతియున్ విద్వ
     త్ప్రియము లగు సాంఖ్యయోగా, శ్రయపరిబోధములు నాదుసంజ్ఞలు వత్సా.128

  1. క్రియలునుఁ గ్రియాఫలంబులుఁ, గ్రియవిరహితపురుషుఁ డనఁ