పుట:హరివంశము.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

470

హరివంశము

     నీరు కూడును గాన కారటంబున భీతు లయి పాఱెదరు కళింగాంగవంగ
     కాశ్మీరభూములు గౌశిక యనునేఱుఁ జలికొండయును బెఱ యలఘుగిరులు
తే. సాగరోపవనంబులు సంశ్రయింపఁ, గలరు జనులు పాడునుఁ బాడుగానియదియుఁ
     గాక యీయుర్వియుండు రక్షకులుగాని, వారుఁ గాకుండుదురు ధరావరులు నపుడు.63
ఉ. నారలు పట్ట లాకులు జనంబులు తాపసు లట్లు కట్టుదుర్
     వీరలు గాఁగఁ బల్లములు చిక్కనికొయ్యలఁ ద్రవ్వి విత్తుదుర్
     గోరిన యారటంబులుగఁ గొండలకాలువ లడ్డకట్టుదుర్
     నీరికి నొయ్యనొయ్య నతినీచత నొంది మనుష్యు లెయ్యెడన్.64
చ. మలినములై శరీరము లమంగళతం గులగోత్రచిహ్నముల్
     దొలఁగఁగ నల్పసంతతులతోఁ బరమాయువు ముప్పదేండ్ల యై
     కొలఁదికి వచ్చి లావులును గ్రొవ్వులుఁ బోవఁగ నింద్రియార్థిసం
     కలనము గొంచెమై మఱియుఁ గల్గు ననేకరుజావికారముల్.65
వ. ఈభంగి నాభీలం బై కాలంబు దవ్వుగా నరుగఁ గడపట నఖిలవ్యవహారవిభేదంబున
     నిర్వేదంబు పుట్టు నిర్వేదంబున సత్త్వగుణంబును సత్త్వగుణంబున జిజ్ఞాసయును
     గలుగుఁ గలిగి సాధుజనంబుల వెదకికొనిపోయి యెయ్యది శోభనం బెయ్యది
     యొనర్చిన నశేషదోషనివృత్తి యగు నట్టిది ధర్మం బని యడుగుదు రట్టి
     తలఁపువారునుం బెక్కం డ్రై యెల్లయెడల నొదవ నది గారణంబుగాఁ గ్రమ్మఱ
     ధర్మంబు దలసూపి వర్ణాశ్రమగోచరం బై వర్తిల్లుచుఁ దొల్లిటిక్రమంబున
     నెంతెంతహాని యై వచ్చె నంతంతియ వృద్ధియు సంభవించు నవ్విధంబున కృత
     యుగం బై తోచి పరిణమించు.66
తే. రాహుకబళంబునను హిమరశ్మిపొలుపు, వెలయఁ గడఁగినమాడ్కి నక్కలియుగమున
     నొయ్య నడఁగు ధర్మము రాహు వోసరింపఁ, జంద్రరుచివోలెఁ గృతయుగోత్సవము దోఁచు.67
క. గుణకర్మవిభాగంబులు, ప్రణుతతపోధర్మములును బ్రహ్మవిబోధ
     ప్రణయములు గృతయుగమున, నణుమాత్రముఁ గొఱుఁతవడక యతిశయము గనున్.68
క. యుగముల త్రిమ్మట కాలం, బగణేయం బై చనంగ నఖిలజనంబున్
     జగతీవరపరివృత్తం, బగుచుండు సముద్భవక్షయంబుల నోలిన్.69
వ. మహామునులును ధర్మార్థకామరూపంబు లైన యాశంసనంబులం గాలజ్ఞు లై యెల్ల
     యుగంబుల నాత్మీయచరితంబు నస్ఖలితంబుగా నొనరించి నిర్దోషం బగుసంతో
     సంబునఁ దపంబు పోషింతు రని చెప్పిన యమ్మహామునివాక్యం బమ్మనుజేశ్వరుం
     డభినందించె నచ్చటిజనంబు లందఱు నానందపులకాశ్రుశోభితశరీరు లగుచు విని
     యమృతాస్వాదనతుల్యప్రమోదకల్యం బగుకల్యాణంబు గని రనంతరంబ.70