పుట:హరివంశము.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

456

హరివంశము

క. ఆతనికి నగపడక యవి, యాతతవేగమున నరిగి యబ్ధి నడఁగినన్
     జాతరభసుఁ డయి కాశ్యప, సూతికి ని ట్లనియేఁ గంససూదనుఁడు తగన్.265
సీ. వినుము పక్షీంద్ర బాణుని జయించుట కేను జను దెంచునప్పుడు సత్యభామ
     నాతోడ బాణధనం బగు మొదవులు గలవఁట కొలది కగ్గలము వాని
     పాలు ద్రావినవారు బలము సత్త్వము నెక్కుడై యెన్నఁడును ముదియక సుఖింతు
     రని వింటి నతనిఁ గయ్యంబున నోడించి యైనఁ దేవలయు నా కవి ప్రియమున
తే. ధర్మ మెడలక తగు కార్యతత్త్వమునకు, నేమియును గీడు గాకున్న నిట్లు సేయు
     మనియెఁ బసులఁ జేరంగ మిథ్యాప్రయత్న, మగుట మేలె యుద్యోగ మి ట్లగుట నీవు.266
వ. ఎయ్యది కర్తవ్యం బూహింపు మనిన నతండు.267
క. ఒండేమిగలదు వరుణుని, దండించి ధనంబు గొనుట దక్కఁగ నని యొం
     డొండ ప్రభునిమది మెచ్చఁగఁ, జండోద్ధతపక్షపవనసంరంభమునన్.268
చ. ఉఱక పయోధితోయము మహోరగవాసముదాఁక నెంతయుం
     దెఱపిగఁ జేయఁ జొచ్చి జగతీవిభుఁ డబ్ధిపువీడు ముట్టెనే
     డ్తెఱఁ బటుశంఖఘోషమున దిక్కులు వ్రయ్యఁగఁ దేరు లొక్కమై
     నఱువదియాఱువేలు రయమారఁగ వెల్వడి తాఁకె నవ్విభున్.269
క. అప్పుడు ఘోరపుఁగయ్యం, బప్పురుషోత్తమున కయ్యె నద్భుతబలు లై
     యప్పతియోధులు మాధవుఁ, గప్పిరి దివ్యోజ్జ్వలాంబకప్రకరములన్.270
క. తనశరములఁ దచ్ఛరములు, దునుమాడి మురారి దొప్పఁదోఁచె బెలుచఁ ద
     త్తనువులు నిశితశరక్షత, జనితబహుళశోణితప్రసరణమున వెసన్.271
మ. బలుఁడుం బుష్పశరుండుఁ దత్తనయుఁడుం బద్మాక్షునిం గూడి పే
     రలుకల్ సూపిరి పక్షిపక్షనఖతుండాఘాతముం దత్క్రియా
     తులితక్రీడఁ దనర్చె ని ట్లెసఁగుతద్ఘోరాహవవ్యాప్తికిం
     గలఁగంబాఱి తొలంకె వారుణబలౌఘంబుల్ విమోఘంబు లై.272
క. అంతయు నెఱింగి వరుణుం, డెంతయుఁ గోపించి యౌర యేమీ కృష్ణుం
     డింత గనుఁగొనక మసఁగెనె, యంతియకా కేమి యనుచు నాటోపమునన్.273
వ. పుత్రపౌత్రగణసమేతుం డై సమస్తసై న్యంబుల సమకట్టి సమున్నతస్యందనంబు
     నం గనకస్యంది యగు సితచ్ఛత్రంబు మెఱయఁ జిత్రతనుత్రంబు దాల్చి చారణు
     లిరుదెసలం గైవారంబులు చేయ నచ్చరలు గంధర్వుల నాడుచుం బాడుచుం
     గొలువ దేవతలును మునులును జయాశీర్వాదంబులు పచరింపఁ బెంపారుభూరి
     ధనుస్స్ఫారంబులు ఘోరంబులునై వారిధరంబులు రణసంవిరావంబులు సంభావింప
     శంభుండు బాణత్రాణసంరంభంబున వెడలు మాడ్కి వెడలి విష్ణుం దలపడి