పుట:హరివంశము.pdf/500

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

452

హరివంశము

ఉ. చేతులు రెండు దక్కఁగ విశృంఖలలీల నిమేషమాత్రలో
     నాతనిచేతు లన్నియును నాతతశోణితధార లూర్ధ్వని
     ష్ఠ్యూతత నొంది యంబరము నుద్ధతసాంధ్యవిభావిభావసం
     స్ఫీతము సేయ రూపడఁగఁ జెక్కె సమూలముగాఁ గ్రమంబునన్.222
క. స్వామి మన సెఱిఁగి కర్జం, బేమియుఁ గడమవడకుండ నిటు నెఱపి తదు
     గ్రామేయహేతిఁ గ్రమ్మఱ, దామోదరు కరమునంద తగ నెలకొనియెన్.223
తే. నెత్రు లొండొండ పెల్లైన నేలఁ బెద్ద, కాలువలు గట్టి పాఱంగఁ గడుఁ దనర్చి
     కావి సెలయేఱు [1]లురిలెడు గనపకొండ, కరణి నుండె బాణుఁడు బాహుకర్తనమున.224
క. ఆవిధమున నిశ్చలుఁ డై , పోవక యయ్యసుర పోకు పోకని వియదా
     శావివరమెల్ల నద్రువం, గా వెస బొబ్బలిడి యార్చి కడురభసమునన్.225
వ. కార్ముకసాయకంబులు కరయుగంబున నమర్చి పేర్చినం గని సైరింపక శౌరి
     వెండియుం జక్రక్షేపంబునందు నాయితం బగుటయు నమ్మహాదేవుండు మహాసేన
     సహితుం డై సత్వరంబుగాఁ జనుదెంచి.226
సీ. ఓకృష్ణ కృష్ణ యత్యుగ్రపరాక్రమ నిన్ను నే నెఱుఁగనే నీవు సకల
     జగములు గలిగించి సర్వంబు నొదవించి యఖిలంబునకు దేపవై యజేయుఁ
     డెల్లలోకంబుల నీదేవుఁ డన మధుకైటభాద్యసురవిఘాతి వైతి
     సురల కాద్యుండవు [2]పురుషోత్తముఁడవు సనాతనుఁడవు విశ్వభూతనిధివి
తే. నీదుచక్రము రణముల నిక్క మెవ్వ్వ, రికి నసంహార్య ముపసంహరింపు మీవ
     బాణుఁ డస్మదాశ్రితుఁడు నాభక్తుఁ డనఘ, విఫలముగఁ జేయకుము నాదువిభుత యిపుడు.227
వ. అనినఁ బుండరీకాక్షుం డవ్విరూపాక్షు నుపలక్షించి.228
తే. దేవ నీవు జగంబుల దేవదైత్యు, లాదిగా నెల్లవారి కభ్యర్చితుఁడవు
     సేయకుండవచ్చునె నీవిశిష్టవాక్య, మేను జక్రంబు నిలిపితి నీశ్వరేశ.229
క. దితిసుతుఁడు బ్రతుకుఁగా కను, మతి నిమ్మెయి నరిగెదను నమస్కృతి యిదె నీ
     కతులభవత్ప్రియకరణ, ప్రతిపాదన మెందుఁ బరమభద్రమ కాదే.230
వ. అని యమ్మహాదేవు వీడ్కొని వాసు దవుండు గరుడగమనమనోహరం బగు రభసం
     బునం బ్రద్యుమ్నతనయుం డున్నయెడకుం జనియే నక్కడ నందికేశ్వరుండు
     దైత్యేశ్వరుం గనుంగొని మహేశ్వరోపవాహ్యం బగు రథంబున నద్దేవుం డున్న
     దెస నేరం గొనిపోయి బాణుం జూచి.231

  1. లరిగెడు
  2. పురుషోత్తముండవు భూనాథుఁడవు