పుట:హరివంశము.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

450

హరివంశము

తే. భగ్నవాహనుఁ డై చిక్కె బాణుఁ డనఘ, పొమ్ము మనసింహయుక్తరథమ్ము గొనుచు
     గణసమన్వితుఁ డగు నాకుఁ గయ్య మింకఁ, దగదు వానిఁ గావుము నీవ తగువిధమున.201
చ. అనుఁడు శిలాదసూనుఁడు రయంబునఁ దే రటు గొంచుఁబోయి శం
     భునికృపకల్మి దైత్యకులపుంగవుతోఁ దగఁ జెప్పి నెమ్మి నా
     తని రథిఁ జేసి సూతకృతిఁ దాను వహించె నతండు క్రమ్మఱన్
     దనుజవిభేదిపై నడరె దర్పము నూతనమై జనింపఁగాన్.202
వ. ఇట్లు బ్రహ్మనిర్మితం బగుదివ్యస్యందనంబుపై నున్న యతనికి బ్రహ్మసృష్టం బగు
     బ్రహ్మశిరం బను నస్త్రంబు ప్రత్యక్షం బై నిలిచె నంత.203
క. దానిఁ బ్రయోగించెఁ గడఁగి, దానవుఁడు ముకుందుపై సుదర్శనసుమహా
     భానునెదుర ఖద్యోత, గ్లానిఁ బడి యడంగె నదియుఁ గడుఁజోద్యముగాన్.204
వ. అప్పుడు బలిధ్వంసి బలినందనున కి ట్లనియె.205
మ. జగ మెల్లం గొనియాడ నప్రతిమదోస్సంపత్తిఁ బెంపొంది యా
     తగవుం గానక పిమ్మటన్ వెడఁగ వై దర్పించి తెల్లప్పుడున్
     బిగువు ల్వల్కుదు [1]సారెసారె కిటు రప్పించె విధాతృండు ని
     న్మగచందంబున కింకఁ బాయక యని న్మల్లీల సైరింపుమా.206
మ. మును వేచేతులు గల్గి క్రొవ్విన మహామోహాంధునిన్ హైహయా
     ర్జునుఁ డన్ రాజు సుదీర్ణుఁ డై భృగుతనూజుం డాజిలో నెవ్విధం
     బునకుం దెచ్చె నెఱుంగవే యటుల నీపొం గే నడంగింతు నెం
     దును బో నిన్ బొరివుచ్చెదన్ గెలిచెదం దో డెవ్వ రేతెంచినన్.207
వ. అని పలికి యమ్మహాబాహుండు సహస్రధారాకరాళంబును లయకాలసహ
     స్రకరసహస్రసమప్రభాభీలంబును సూర్యసోమాగ్నిగ్రహనక్షత్రవజ్రాశనివిద్యు
     త్ప్రముఖసకలతేజోమయంబును యమనియమబ్రహ్మచర్యపాతివ్రత్యయోగ్య
     వ్రతాదిసుకృతసముచ్చయసంశ్రయంబును దేవాసురగంధర్వమనుష్యస్థావరాత్మక
     త్రైలోక్యసత్త్వస్వరూపంబును సర్వభయతిమిరనిత్యప్రదీపంబును ప్రమోదితా
     శేషదివిషచ్చక్రంబు నగు చక్రం బమ్మహాదైత్యుపై వైవ నుద్యుక్తుం డయ్యె
     ననంతరంబ.208
క. శర్వుఁడు పార్వతిఁ గనుఁగొని, సర్వజగంబులను విష్ణుచక్రము తేజో
     గర్వ మజయ్యము గావున, దుర్వారము బలసుతునకుఁ దోయజవదనా.209
క. నీ వొకవెరవున వానిం, గావుము నావుఁడు మృడాని గ్రక్కున లంబా
     దేవిఁ బనిచె నెప్పటిక్రియ, గావింపఁగ దాను నపుడు కరుణ యెలర్పన్.210

  1. సారెసాన