పుట:హరివంశము.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - అష్టమాశ్వాసము

     నందనసమసౌంద
     ర్యానందితయువతిహృదయ యధికాభ్యుదయా
     యానతజనహృద్యదయా
     భూనుతజయశక్తిభీమ ప్రోలయవేమా.1
వ. అక్కడకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు దేవీవచనసమాశ్వాసితుం
     డై వాసుదేవతనయ తనూభవుం డున్నంత నటమున్న యక్కడ.2
సీ. ఆచిత్రరేఖ మాయాచిత్ర[1]ముఖమున నమ్మహాభుజుఁ బ్రణయమునఁ గొనుచుఁ
     బోవ నాతని యంతిపురముభామిను లెల్ల నాత్మేశుఁ బొడగాన కార్తి నొంది
     ప్రియులఁ బాసినకిన్నరీసమూహముఁబోలే నాక్రందనము సేయ నప్పొలఁతుల
     యులివు దివంబున నుద్విగ్న[2]కురరీవిరావంబు క్రమమునఁ బ్రబల మగుచుఁ
తే. బరఁగె నయ్యేడ్పులోన నప్పడఁతుల కట, యెవ్వఁడొకొ మామనోనాథుని నసమానుఁ
     గడఁగి మాకన్ను లెల్లను గప్పి మమ్ము, ననదలుగఁ జేసి యెక్కడేఁ గొనుచుఁ బోయె.3
చ. బలరిపుఁ డాదిగాఁ గలసుపర్వులు గర్వితదైత్యభీతు లై
     బలమఱి వచ్చి మీవిభునిబాహులనీడ యుపాశ్రయింతు ర
     య్యలఘునిపౌత్రుఁ గొంచుఁ జనునంతటివాఁడును గల్గె నౌర యే
     బలియుఁడొ భీతిదాయికినిణ బ్రస్ఫుటభీతిదుఁ డయ్యె నియ్యెడన్.4
తే. పగఱ బరి వ్రేసి యాఁగి దర్పంబుఁ జలముఁ
     గోలుపుచ్చుమురారాతిక్రోధవహ్ని
     యుఱుక యిట్టుల మండఁగ నూఁదునుదుటు
     గలుగు గుండియగలవాఁడు గలఁడె జగతి.5
చ. తెఱచిననోరితో నొదవుతీవ్రపుమృత్యువుకోఱ లూఁపఁగా
     నఱుముట గాదె మాధవున కప్రియ మి ట్లొనరించు నింద్రుడుం
     బఱిపఱిగాక పోఁగలఁడె బాహుమదంబున వాసుదేవు న
     క్కఱపడఁ జేసిరేవి విధి గానరొ కాక దురాత్ము లేమియున్.6
తే. వగలపెనువెల్లిఁ బడితి మెవ్వలనఁ దేప, గాంతు మసురాంతకునికృప గాంచుచంద
     మెద్ది పతిలేనియతివల యెడరు జముని, యాటకట్టు దుర్దశలకు నాకరంబు.7
వ. అని యి ట్లొనర్పు విలాపంబునకుం గలంగి యిది యేమి యెక్కడి యార్తస్వరం
     బనిరుద్దుదేహంబున నేమిభయంబు పుట్టె గృష్ణసంరక్షితులకు భయంబు కలిమి

  1. విధమున
  2. కుహరరావంబు క్రమంబున