పుట:హరివంశము.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 7.

427

వ. నీ వేల వగచెదవు బాణభాగధేయంబున కిది యవసానం బిటుసూడు మని య
     య్యింతిం గొంత యుపశమితశోకం జేసి.263
క. ఆపదలకుఁ బరిహారం, బై పూర్వులు నిశ్చయించి నట్టిమతము దు
     ర్గాపదసంస్మరణమ యని, యాపరమేశ్వరిఁ దలంచి యంచితభక్తిన్.264
వ. అమ్మహాముని ప్రకరపరిగీతం బైన వాక్యజాతంబున ననిరుద్ధుండు విశుద్ధాంతరం
     గుం డై యి ట్లని స్తుతించె.265
ఉ. నందునికూర్మినందన యనంగ యశోదకృశోదరంబు నిం
     డం దగ నావహించి ప్రకటంబుగ విష్ణునితోడఁబుట్టువై
     సుందరి గోకులైకనవశోభనయై జనియించి యేజగ
     ద్వందిత యొప్పె నాయసురదారణి నాదిమశక్తిఁ గొల్చెదన్.266
తే. తనువులం దెల్ల నొలసి చేతన యనంగఁ
     బ్రజ్ఞ యన మాయ యనఁగఁ బూరణి యనంగఁ
     బరమ యన దాంత యన నొప్పుహరపురంధ్రి
     బరమభద్ర దాక్షాయణిఁ బస్తుతింతు.267
సీ. చంద్రబింబాననఁ జారునేత్రత్రయశోభిని సురమునిస్తుతచరిత్రఁ
     గాళి గాత్యాయనిఁ గంసధిక్కారిణి నహితభయంకరి నభయదాత్రి
     బ్రహ్మవాదినిఁ గామపాలిని సిద్ధసౌదామిని రేవతిఁ దరుణి నచల
     యోగప్రదాయిని యోగిని గంధర్వి లక్ష్మి సరస్వతి లజ్జఁ గీర్తి
తే. సకలతిథులఁ జతుర్దశి షష్ఠిఁ బౌర్ణ, మాసిఁ బంచమి మహనీయమహిమ నంబ
     ధ్రువఁ దపస్విని సావిత్రిఁ దుష్టి శాంతి, దైవమాత భక్తిప్రియఁ దలఁతు భక్తి.268
చ. ఇరువదియేడుదారలును నేఱులు దిక్కులుఁ దాన యైనయీ
     శ్వరిఁ బరమాత్మికన్ మలయవాసిని వారుణి వింధ్య మేరుమం
     దరగిరిమందిరోద్ధరణి ధారిణి సింహరథన్ వృషధ్వజన్
     వరతరుణీలలామ ననవద్యవరప్రద నాశ్రయించెదన్.269
తే. దుర్గ దుర్జయ దుర్గమ [1]దుర్గ్రహ సతి, భద్రదర్శన శివ వజ్రపాణి భగిని
     శబరి జీవనధారిణి శబరసైన్య, నాథనాయిక నాత్మ వర్ణన మొనర్తు.270
క. కౌమారిఁ గామదాయిని, సోమరసాస్వాదలోల శుంభనిశుంభ
     వ్యామర్దినిఁ బార్వతిఁ బృథు, సామజకుంభస్తనిం బ్రసన్నఁ దలంతున్.271
సీ. దేవపత్నులు సర్వదివిజకన్యలుఁ గాద్రవేయకుటుంబినీవితతి వారి
     కన్నియ లప్సరోగణములు మునిభామినులు సిద్ధవిద్యాధరులవనితలు
     మనుజపురంధ్రు లి ట్లెనసినసుందరీసృష్టి యంతయును లక్షింప నంబ
     నీవ యచింత్యవు నిత్యాప్రమేయప్రకృతివి త్రైలోక్యసంకీర్తనీయ

  1. దుర్గ్రహ దుర్గహరిణి