పుట:హరివంశము.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

410

హరివంశము

     వారణంబులుఁ దేరులు నశ్వంబులు నందలంబులు నెక్కిరి కొందఱు విమానా
     రూఢులు నాకాశగాములు నై రిట్లు సర్వపరివారంబును గొలువ శర్వుండు
     మగుడి యాత్మీయం బగు దివ్యనివాసంబు ప్రవేశించి సుఖంబుండె నంత.93

ఉషాకన్య దనస్వప్నమందు ననిరుద్ధసమాగమంబు గనుట

ఉ. అంటినఁ గందుమేనుఁ బసనారెడు జవ్వనమున్ రసంబు పె
     న్నింటలఁ గూర్చుకామమును నిబ్బర మైనమదంబునై మనం
     బొంటికిఁ బోక భర్తృరతి కువ్విళులూర నిరంతరస్పృహా
     కంటకితాంగియై యలరుకన్నియ బాణునికూఁతు రత్తఱిన్.94
చ. తనవిహరించుసౌధమునఁ దల్పముపై మును దేవి యానతి
     చ్చిననిశియందు బోఁటులును జేరువ నిద్దురవోవఁ దాను నిం
     పలరఁగ నొం డెఱుంగని సుఖాచితనిద్ర నెలర్చియుండఁగా
     ననఘశరీరుఁ డై నపురుషాగ్రణి [1]మారసమానుఁ డిమ్ములన్.95
సీ. కలలోన నయ్యింతిఁ గదిసి మోమున నవ్వు గడలొత్తఁ దియ్యనిపలుకు వలికి
     కెంగేలితోఁ గేలు గీలించి నెమ్మేను మేనను బెరయించి మెలపుతోడ
     బిగియారఁ గౌఁగిట సొగియించి మనసులు రెండును గరఁగి యొక్కండ కాఁగ
     నేకోర్కు లేమిటి కెలసిన వానికిఁ జుబ్బనచూఱలై చొప్పడంగఁ
తే. జతురసంభోగరసములు చవులవెంట, నిద్దఱును క్రొత్తగాఁ గని యేపు మిగుల
     నట్టిచందంబు గావించి యాత్మమూర్తి, యబలతలఁపున నచ్చొత్తినట్లు సేసె.96
వ. తదనంతరంబ.97
తే. ఉదరిపడి మేలుకని కన్ను లువిద విచ్చి, చూచి కానద యట్టియాసొబగు నచట
     భయము లజ్జయు మాహంబు బాలమనసు, పొదివెఁ దమము మంచును దమ్మిఁ బొదువుమాడ్కి.98
చ. అది కలలోని కానుపయి యంబికయావతి మున్న కల్గి య
     ట్లొదవుట ముగ్ధతం దలఁప కుగ్మలి నిక్కమకాఁగఁ జూచి పె
     ల్లొదవెడుబాష్పవారి నయనోత్పలపీడ యొనర్ప రోదనా
     భ్యుదయమనోజ్ఞ మై వదన మొప్ప వడంకుచు నార్తి వొందఁగాన్.99
వ. మణిదీపమనోహరం బైన యమ్మందిరంబున చేరువ నిద్రించి యున్న చెలికత్తియ
     లెల్ల మేల్కని సంభ్రమంబునం బొదివికొనిరి వారిలోనం జిత్రరేఖ యల్లన
     యమ్ముద్దియశిరం బొక్కకేలఁ గ్రుచ్చి కౌఁగిలించి.100
మ. చెలియా యోడకు మేల యేడ్చెదవు నీచిత్తంబులోఁ దాపముం
     దలఁకుం జేయఁగ నెవ్వరుం గలరె యీత్రైలోక్యమధ్యంబునన్

  1. దేవ