పుట:హరివంశము.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

394

హరివంశము

వ. అరిగి తదీయస్కంధావారంబున కనతిదూరంబునం బాంచజన్యస్వనంబునం బంచ
     మహాభూతవిస్తారవిదళనంబు సేసిన.215
ఉ. ఆతనిఁ గాంచి పౌండ్రబల మార్పులుఁ దూర్యరవంబులున్ దిగం
     తాతతసంప్రసారముల నచ్చెరువై యెసఁగంగఁ దాఁకి యు
     ద్యోతితకుంతయష్టిశరతోమరశక్తిపరశ్వథాతిసం
     పాతనిరంతరంబుగ నభంగురఘారరణం బొనర్చినన్.216
తే. చటులశార్ఙ్గనిర్ముక్తోగ్రసాయకములఁ, గలుషకౌమోదకీవిమోక్షక్రమముల
     గడియతడవులోఁ బొడిపొడిగా నొనర్చె, నసురమథనుండు రిపులమోహరమునెల్ల.217
వ. ఇట్లు కాశీశుసైన్యసహితంబుగాఁ గలసేన లన్నియు మడిసినఁ బౌండ్రవాసుదేవుం
     డవ్వాసుదేవున కెదురై నడచె నట్టిసమయంబున.218
తే. శంఖచక్రగదాఖడ్గచాపములకుఁ, బాంచజన్యాదినామకల్పనము లొలయఁ
     బడగఁ గృత్రిమతార్క్ష్యుండు ప్రజ్వరిలఁగఁ, దేరిపై నున్నపగతు నాశౌరి గనియె.219
వ. కని తదీయశరీరంబున కలంకారంబు లైనపీతాంబరకృతకకౌస్తుభశ్రీవత్సవైజ
     యంతీమకుటలక్షణంబు లుపలక్షించి యెలుంగెత్తి నవ్వి యద్దేవుండు దివ్య
     గంభీరస్వరంబున నతని కి ట్లనియె.220
సీ. పౌండ్ర భూవర నీవు భావంబునందు మదీయాంకములు మోవఁ దివిరితేని
     నాపాలి కేతెంచి నమ్రుఁడవై యేను నీవాఁడ నా కిమ్ము నీదుచిహ్న
     ముల నని వేడిన లలి శాశ్వతంబులై చెల్లవె వెఱ్ఱివై చెట్టచేసి
     తింకనైన వినీతి నేతెంచి వేఁడుము కాచెద నఖిలలోకముల నిన్ను
తే. నీదృశోజ్జ్వలవేషసమ్మోదమాన, హృదయుఁగాఁ గరుణించెద నింత నిజము
     వినుము శరణాగతత్రాణవిపులనిశ్చ, యాఢ్యుఁగా నెఱుంగుము నన్ను నాత్మలోన.221
క. నాచక్రముచే మడిసిన, యాచకలుర నరకుఁ దొట్టి యకట యెఱుఁగ వీ
     వాచెడుటలు మేలులుగాఁ, జూచెదు నినుఁ గావ నొకనిఁ జూపుమ యిచటన్.222
వ. నీవు నన్ను రమ్మని దూతచేతఁ జెప్పి పుత్తెంచిన నీదెస వచ్చితిఁ దగిన బుద్ధియుం
     జెప్పితి నిట్లు సేయుము చేయకున్న నేను నీ చెప్పినట్లు చేసి చక్రకౌమోదకీప్రముఖ
     చిహ్నంబులు నీమీఁద విడిచెద గరుడునిం ద్వదీయధ్వజంబుపై కనిచెద నట్లు
     చూడు మని పలికిన బౌండ్రుం డతని కి ట్లనియె.223
మ. అవనీనాథుల నెల్ల నుద్ధతుల గర్వాంధ్యం బడంగింప నే
     నవతీర్ణుండ నెఱుంగవే యకట మిథ్యావాసుదేవాహ్వయం
     బవినీతిన్ ధరియించి కొందఱకు మోహశ్రాంతి పుట్టించె దీ
     యవలేపంబు నెఱింగి కాదె నీను దండార్హుండుగాఁ జూచితిన్.224