పుట:హరివంశము.pdf/441

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 6.

293

సీ. పుట్టినఁగోలెను బోఁడిమి సెడి గొల్లమందలోఁ బెరిగి ధర్మం బెఱుఁగక
     వనితావధంబు గోవధమును బాంధవవధముఁ గావించి దుర్వర్తనమునఁ
     దిరిగి తంతటఁబోక తేఁకువమాలి నా పేరుఁ జిహ్నములుఁ గల్పించికొంటి
     వాసుదేవుం డన వసుధపైఁ గారణజన్మంబు నొందినసత్యఘనుఁడఁ
తే. [1]గడఁగి నేన కా నీకు నెక్కడితెఱంగు, బ్రతుకు వలతేని వినుము నాపనుపు సేసి
     చక్ర మాదిగ విడిచి మత్సంజ్ఞ యుడిగి, నడిఁకి చనుదెమ్ము నాశరణమ్ము సొరఁగ.207
వ. అని యిట్లు దూతముఖంబున వెడలిన విమత వాక్యం బాకర్ణించి యాకర్ణవికాస
     హాసమధురలోచనుం డగుచుఁ గమలలోచనుండు వానిం గనుంగొని.208
క. మీయేలికమాటలు దూ, తా యెంతయు మంచి వేను దప్పక యాతం
     డేయనువునఁ బలికెడుఁ ద, న్నాయర్థము చేయువాఁడ నటువిను దెలియన్.209
సీ. నను నట కరుగు దె మ్మనియెఁ గావున నెల్ల యడియాలములతోన యరుగుదొంతు
     వినుతచిహ్నంబులు విడువు మన్నాఁడు గావునఁ జక్రపూర్వతఁ దనరువానిఁ
     దనమీఁద విడిచెదఁ దనశరణము సొచ్చి మనుమంట గాదు గావునఁ గడంగి
     తనశరణంబె పెంపొనరంగఁ జొచ్చి నిర్భయుఁడ నై భూరిసంపద హరింతు
తే. ధరణి నెందుఁ బేర్కలవాఁడు దాను నాకు, దాఁటవచ్చునె తనయాజ్ఞ దడయ కింత
     వట్టు నేడు నెల్లిటిలోన నిట్టలముగఁ, జేయఁగలవాఁడ నింతయుఁ జెప్పు మీవు.210
క. అని కట్టనిచ్చి వీడ్కొలి, పిన దూతయుఁ జని యుదారభీమగభీర
     ధ్వనిరమ్య మైనవిష్ణుని, వినిశ్చితోక్తంబు పౌండ్రవిభునకుఁ జెప్పెన్.211
వ. అతండును సహాయు లగు రాజులందఱకు నివ్విధం బెఱింగించి వారునుం దానును
     సర్వసైన్యంబులం గొని వారణాసీపురంబు వెలుపల నాయితం బై మురాంతకు
     రాక కెదురుసూచుచుండెఁ గాశీవిభుండును దనసేనలతోడఁ జెలికానివెనుకయై
     నిలిచె నంత నిక్కడ.212
సీ. సౌత్యకిమున్నుగా శత్రునిర్మథనంబునకుఁ దారతార నిర్ణయము గాఁగ
     జాలుదు మని వచ్చి యోలిఁ బంతంబులు పలుకుచుట్టంబులఁ బరమపురుషుఁ
     డాదరంబునఁ జూచి యస్మత్పరోక్షంబునందు మీ చేసినయట్టిలావు
     సామాన్యమే రిపుజయము మీ చేతికి వచ్చినయది సహవాసకృత్య
తే. మింత [2]గడవంగ నెట్టది యేను వోయి, నాకు వలయు కార్యాంశం బొనర్చివత్తు
     నిలుఁడు మీ రని యందఱ నిలిపి గురుజ, నానుమతమున మంగళోద్యమ మెలర్ప.213

శ్రీకృష్ణుఁడు గరుడవాహనారూఢుఁ డై పౌండ్రవాసుదేవునిఁ జంపం బోవుట

క. గరుడస్కంధారోహణ, దురతిక్రమగమనలీలతో నరిగె వెసం
     బరిపంథిమీఁదఁ [3]భూతో, త్కర మఖిలముఁ దనకు శుభము గాంక్షింపంగన్.214

  1. నేనకా కెక్కడితెఱంగు నీకు బ్రతుక, వలచెనేనియు నాసను వలరఁజేసి
  2. గడవంగదేటది, గడవంగ నేటది, గడువంగ నేఁటది.
  3. బౌరో