పుట:హరివంశము.pdf/439

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 6.

391

వ. వారలిరువురకు నతిభీషణం బగుగదారణంబు ప్రవర్తిల్లె నందు.184
సీ. గదలొక్కటొకటిఁ దాఁకఁగ నుప్పతిలు మిడుంగురుల దిక్తటములు దుఱఁగలించె
     హుంకారములు నగరోన్నతప్రాకారవలభులఁ బ్రతిశబ్దవతులఁ జేసెఁ
     జరణఘట్టనముల ధరణియంతయు [1]బిట్టు గదలి పాతాళంబు గదియఁ గ్రుంగెఁ
     దర్జనోక్తులపటుధ్వానంబు లాకాశచరులకుఁ జిత్తసంచలన మొసఁగె
తే. నుభయబలములవారుఁ బోటుడిగి వెఱయు, వెఱఁగుపాటును గదుర నవ్వీరవరులు
     జూచుచుండిరి కలహసంక్షుభితఘోర, శూరవారణద్వితయంబు జూచుకరణి.185
వ. ఇవ్విధంబునఁ బౌండ్రసాత్యకు లొక్కదిక్కునను బలదేవనిషాదపతు లొక్కవల
     నను గయ్యంబు సేయుచుండ నలువుర కారణంబున నపరిమితజనసంక్షయం బగు
     చుండె నంత.186
ఆ. దీపరుచులతోన తిమిరంబు దోడ్తోనఁ, దఱుఁగఁ దారకములు దరతరంబ
     యడఁగ వస్తుమూర్తు లన్నియు నొండొండ, తోఁపఁ దెల్లనయ్యెఁ దూర్పుదిక్కు.187
క. అరుణోదయరుచు లొయ్యనఁ, బరఁగుచుఁ గమలములతోన ప్రాణుల కెల్లం
     బరిబోధము నొదవింపఁగఁ, గరణీయంబులు బహుప్రకారత వెలసెన్.188
క. కుముదవనంబులతోడన, కమనీయవినమ్రజననికరపాణితతుల్
     సమయముకుళితమ్ములు గాఁ, గమలహితుఁడు ప్రధమగిరిశిఖరమణి యయ్యెన్.189

శ్రీకృష్ణుఁడు కైలాసంబుననుండి మరలి ద్వారకానగరంబునకు వచ్చుట

వ. అట్టిదివసప్రారంభంబున సంరంభం బెసుగ రెండుదిక్కుల యోధులు నధికసంరం
     భంబుగా బెరసి పెనంగఁ బౌండ్రవిభుం డెలుం గెత్తి యాత్మీయసైన్యనాయకుల
     నుద్దేశించి.190
క. మన మెంతలావు సేసినఁ, బని దీఱదు నేకుఱండు పగతుఁడు లోకం
     బున దూఱు రాదె యితరుల, ననిఁ జంపినఁ [2]గాన వలవ దాహవ మింకన్.191
మ. హరి యేతెంచుట లెస్సగా నెఱిఁగి తీవ్రాటోపదీప్తంబుగాఁ
     బరిమై వత్తము గాకయున్నఁ [3]గడిమిం బ్రత్యర్థి నాహూతిఁ జే
     సి రణక్రీడఁ జలంబు సూపుదము ప్రస్ఫీతాస్మదియోగ్రవీ
     ర్యరసారూఢికి నోర్తురే యిచట నీయల్పుల్ వృథావిక్రముల్.192
వ. అని పలికి బలంబులం దివియం బనిచిన వారును నట్ల సేయ సైన్యసమేతుం డై
     క్రమ్మఱఁ జని.193
క. తనకుం గాశిమహీపతి, యనుఁగుంజెలి యగుటఁ జేసి యాతనినగరం
     బున నుండె సహాయుల నెల్లను బిల్వ ననేక సమరలంపటబుద్ధిన్.194
వ. ఇక్కడఁ గృష్ణబాంధవులు విజయంబు చేకొని తూర్యవిరావంబులుం బ్రమోద
     నాదంబులు మేదురంబులుగాఁ బురంబు ప్రవేశించి యందఱుం దమలోన.195

  1. బట్టు గదలి పాతాళంబు గలయ బ్రుంగె
  2. గాదు
  3. గరిమన్