పుట:హరివంశము.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

390

హరివంశము

     వసరంబున నుభయబలంబులం బేరుకలరథికు లిరుదెసలం గ్రందుగాఁ దఱిమి సందడి
     చేసిన నాసాహసికులు పాసిపోయి రంత.173

ఏకలవ్యుఁడు బలరామునితోఁ దలపడి ఘోరయుద్ధంబు సేయుట

మ. బలదేవుండును నేకలవ్యుఁడును దృప్యద్బాహులై తాఁకి యు
     జ్జ్వలచాపంబులఁ బోరుచో బలుని వింశత్యస్త్రతీవ్రాహతి
     న్బొలియం జేసి తదాశుగంబుల వెసన్ సూతుం బ్రపీడించి క
     ట్టలుకం ద్రుంచె నిషాదనాథుఁడు ధనుర్జ్యావల్లి భల్లంబునన్.174
తే. వింట నొండొకగొనయంబు వేగఁగూర్చి, కేశవాగ్రజుఁ డొకకోలఁ గేతుదండ
     ముర్విఁగూల్చి కార్ముకము వేఱొకట నఱికి, [1]పదిట సారథిఁ బదిట నబ్బలియు నొంచె.175
క. మఱియును ముప్పదియమ్ములఁ, గిఱికొన నరదంబు వొదివి కేళీయ పోలెన్
     మెఱసిన సైపక వేఱొక, నెఱవి ల్లెక్కిడి కిరాతనృపతియుఁ గడఁకన్.176
క. ఆతనిచనుమర విశిఖ, స్యూతము సేయుటయు నొచ్చి స్రుక్కి హలాంకుం
     డాతతరోషసముద్ధతుఁ, డై త్రుంచెం [2]బిడియకొలఁది కహితునిధనువున్.177
వ. ఏకలవ్యుం డడిదంబు వుచ్చికొని [3]విసరి వైచె నది యదునందనుం డేనమ్ముల నడు
     వన పొడి చేసి మఱియు నొక్కమండలాగ్రంబు సారథిగుఱచి వైచినం బదిబాణం
     బుల ఖండించి చండఘంటావిభూషణ యగు భీషణశక్తి వైచిన నొడిసిపట్టి
     మగుడఁ దద్వక్షంబు లక్ష్యంబుగా వై చిన నప్పాటున నమ్మేటిమగండు సొమ్మసిలం
     బోయి తేరిపయం బడినం గని తదీయు లగు నిషాదయోధు లెనుబదియెనిమిది
     వేలు రథతురంగమాతంగసముదయంబుతోడం గదిసి.178
క. మిడుతపరివోలె దిక్కుల, యెడములు దమమయమకాఁగ [4]నేకాకృతితో
     గడిఁదిగఁ [5]బొదివిరి రాముని, నడరఁ దదాఘోష ముగ్రమై గగనమునన్.179
తే. అలిగి హలమును ముసలంబు హస్తయుగము, నందు ధరియించి తాలాంకుఁ డరద ముడిగి
     యెఱుకుమూఁకలమీదికి నుఱికి విలయ, కాలకలుషకృతాంతానుకారి యగుచు.180
క. నాఁగటఁ దగిలిచి తగిలిచి, వ్రేఁగగురోఁకలి యమర్చి వ్రేయుచుఁ దోడ్తో
     రేఁగెడుదర్పమ బాసట, గాఁ గూల్చెను బగఱనెల్లఁ గడుఁజోద్యముగాన్.181
వ. అట్లు ముహూర్తమాత్రంబున నఖిలనిషాదసైన్యంబులం బొడిసేసి యపరిమిత
     రక్తహంసమేదంబులుఁ గ్రవ్యాదభూతబేతాళజాతంబులకు నభూతపూర్వకం
     బగు పర్వంబు సంఘటించె నంతం దెలిసి యేకలవ్యుండు.182
క. తనసేనపాటు దెలియం, గని కోపము మిగులఁ బెద్దగద గొని బలభ
     ద్రునిమీఁదఁ గవిసె నతఁడును, ఘనగదఁ గైకొని కడంగెఁ గలుషం బెసఁగన్.183

  1. పదిటఁ బదిట సారథి రథి బలిమి నొంచె.
  2. పిడికొలఁదికిన
  3. వీచి
  4. నేకాస్త్రతతిన్
  5. బొడిచిరి