పుట:హరివంశము.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

382

హరివంశము

     ననిమిషులుఁ గృష్ణునకు నమస్కరించి యతనిచేత వీడ్కోలు వడసి తమ తమ
     నివాసంబుల కుఁ బోయిరి హరియును గరుడుని నెక్కి యెప్పటిమార్గంబునం గ్రమ్మఱి
     సాయాహ్నసమయంబున బదరీవనంబు ప్రవేశించె నని చెప్పి వైశంపాయనుండు
     జనమేజయున కి ట్లనియె.95

పౌండ్రవాసుదేవుఁడు ద్వారకమీఁద దండెత్త నుద్యోగించుట

తే. వాసుదేవుఁడు ప్రీతిఁ గైలాసయాత్ర, సేయు టేర్పడఁ జారులచేత నెఱిఁగి
     పౌండ్రుఁ డాత్మీయపక్షభూపాలకోటిఁ, గూర్చి యందఱ కి ట్లనుఁ గొలువునందు.96
మ. ధరణీమండలి నెందునుం దొడరి దోర్దర్పోద్ధతిం గ్రాలుభూ
     వరులం బల్వుర నుక్కడంచితిఁ గడున్ వశ్యాత్ము లై వారు నా
     కరిగా నాత్మధనావళు ల్వరుసఁ బ్రత్యబ్దంబు నర్పింతు రె
     వ్వకు వస్మత్పటువిక్రమస్ఫురణకున్ వక్రింప రెక్కాలమున్.97
క. యాదవులు కృష్ణుప్రాపున, నాదగువేఁడిమికి [1]నోర్చి నడుఁకక యెదురై
     యేదియు నెఱుఁగరు శౌర్యో, న్మాదంబున నున్నవారు మహిమోద్ధతు లై.98
వ. ఇది మదీయం బగు హృదయంబున శల్యభూతం బై యున్నయది యదియునుం
     గాక.99
తే. తాను బసులఁగాచినగొల్ల దనకు నేటి, మహిమ యాకృష్ణుఁడును నింత మఱచినాఁడు
     చక్ర మొక్కటి గల దని చక్కనుండఁ, డేపు మిగిలిన మగఁటిమి సూపఁ గడఁగు.100
క. తన చక్రముఁ దన శంఖముఁ, దన శార్ఙ్గముఁ దనదు గదయుఁ దన ఖడ్గంబున్
     నను జోఁకినఁ జెడిపోవుట, మనమునఁ దలఁపఁ డతఁ డధికమత్తుఁడు గాఁడే.101
తే. వసుధలోపల నిరువురు వాసుదేవు, లున్నఁ దడఁబాటు గాదె యే నొక్కరుఁడన
     పేరు సెల్లింతు నని నీని పేరణంతు, మెచ్చి [2]భూపాలు రెల్లను బిచ్చలింప.102
క. నాకు సుదర్శన మనునీ, భీకరచక్రంబు గలదు బెట్టిదముగ నే
     నాకైదువు గొని చేసెద, నాకృష్ణు సుదర్శనంబు ననిఁ బొడిపొడిగాన్.103
తే. అతని పాంచజన్యమునకు నస్మదీయ, పాంచజన్యశంఖం బిది ప్రతి[3]భటంబు
     దీనియుద్ధతధ్వానంబు దెసలఁ బొంగి, మ్రింగుఁ దన్మహాశంఖసమిద్ధరవము.104
క. హరిచేతినందకము మ, త్కరవాలం బైన నందకంబును నని ని
     ర్భరముగఁ దాఁకెడు క్రేంకృతి, విరచింపదె మీకు నెల్ల విస్మయభయముల్.105
మ. కమలాక్షుండును నేను నొండొరుపయిం గౌమోదకుల్ వైవ ను
     గ్రముగాఁ బోర సహస్రలోహరచనల్ గావింపఁగాఁబడ్డ యీ
     యమదండోపమ మైన మద్గదకు నాహారంబు గాకుండఁ బ్రా
     ణములం గావఁగ శక్యమే యతనికిన్ సర్వప్రయత్నంబులన్.106

  1. నొచ్చి
  2. భూచారు
  3. భటుండు