పుట:హరివంశము.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 6.

375

     ముఖోన్నతాంసమహాహనులును ద్రిబాహు చతుర్బాహు పంచబాహు శతబా
     హు లనుపేళ్లు గలిగి తాదృశంబు లైనయాకారంబుల నద్భుతంబులై పెంపుతెంపా
     రిన యసంఖ్యాతభూతంబులు సంప్రోతప్రేతకరాళంబు లగుశూలంబులతోఁ బరి
     పూరితకీలాలంబు లగుకపాలంబులతో నతికఠినపాతంబు లగుచరణఘాతంబుల
     ధరణి యద్రువ నాడుచుఁ బటహాడంబరనిర్భరంబు లగువీరస్వరంబులం బాడుచుఁ
     బ్రకంపితదిగ్భాగంబు లగునూరువేగంబులం బరువులు పెట్టుచు నాక్రాంతగగ
     నంబు లగులంఘనంబుల నెగయుచుఁ దమతమవంగడంబు లేర్పడ నడిచిరి ప్రశాం
     తస్వాంతులు ప్రాప్తేంద్రియజయులు నంగీకృతయమనియములు నాత్మజ్ఞానవిజ్ఞు
     నులును నగు ప్రమథులుఁ ద్రిపుండ్రాంకితలలాటంబులు భస్మోద్ధూళితవక్షంబులు
     నక్షసూత్రశోభితహస్తంబులు రుద్రాధ్యయనతత్పరముఖంబులు భక్తిపులకితావ
     యవంబులు నానందబాష్పవిస్ఫురల్లోచనంబులు నైనదేహంబుల వెలసి విలసిల్లిరి
     చతుర్భుజులుఁ ద్రినేత్రులుఁ జంద్రరేఖాంకితజటామకుటులు శూలడమరుఖట్వాం
     గలక్షణులు నాగయజ్ఞోపవీతులు శార్దూలచర్మవసనులు నగురుద్రులు భద్రమూర్తు
     లునై కీర్తితానుభావధుర్యంబు లగునైశ్వర్యంబు లెనిమిదియుఁ దమవశంబున
     వర్తిల్ల జగదుద్భవస్థితిసంహారకారణంబులయందుఁ జంద్రశేఖరునంతవారల యగు
     టం జేసి వారిరుహాసనవాసవప్రముఖులకు నఖిలోపచారంబుల నర్చనీయులు గావునం
     గమనీయవైభవులై విభవంబున శోభిల్లిరి విముక్తసంసారులు విపులతపస్సారులు
     నధిగతసర్వవేదులు నభ్యస్తశాస్త్రపారగులు ననన్యభక్తిగంభీరులు నగుమునివరులు
     కృష్ణాజినకమండులుకుశయష్టి ప్రభృతిచిహ్నంబు లమర భూతిధవళితంబు లగుశరీ
     రంబు లలర మాహేశ్వరంబు లగు శ్రుతిసూక్తంబులఁ బౌరాణికంబు లగుభవ్య
     స్తోత్రంబుల లౌకికంబు లగుజయజయధ్వానాలోకశబ్దంబులం బరమేశ్వరునిఁ బరి
     తుష్టుం జేయుచు మహాసంఘంబు లై మెఱసిరి సర్వాంగసుందరులును సమస్తసిద్ధి
     సంపన్నులును సంతతసుఖాభిరాములును సంభృతానందపారవశ్యులును సమ్య
     క్ప్రబుద్ధులు నగుసిద్ధులును విద్యాధరులుం బ్రియాసహితు లయి దివ్యభూషణ
     గంధమాల్యాంబరాకారంబు లగునలంకారంబుల నింపారఁ జెలువొందిరి వీణా
     వేణుశంఖభేరీమృదంగవాదనంబులు మంగళగానంబులు నొనర్చుచు గంధర్వులు
     నప్సరోంగనలు లలితాంగనాసత్వవచోదాత్తంబు లగునృత్తంబులు రమణీయం
     బులు గావించిరి మహావాచాలు రగుచారణులు త్రిపురదహనదక్షాధ్వరధ్వంసనం
     బులు మొదలుగాఁ గలగంగాధరువిజయావదానంబులు గైవారంబులు సేయుచుఁ
     జెన్ను మీఱిరి వైమానికముక్తంబు లగుపుష్పవర్షంబులం బొదలుసౌరభ్యం
     బులు గైకొని కైలాసశైలనిర్ఝరశీకరంబులం దడిసినమందసమీరుండు [1]సమీహి
     తాసురవితానవైజయంతికా[2]పల్లవుం డగుచు నుల్లసిల్లె నిట్లు మహావిభూతి విస్త
     రిల్ల విజయం చేసి విశ్వేశ్వరుండు.33

  1. సమీరితసురవినూన
  2. వల్లభుం