పుట:హరివంశము.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 6.

373

ఉ. అంబిక నెచ్చెలు ల్విజయ యాదిగఁ బువ్వులు గోయుకేళి రా
     గం బగునిక్కువంబుఁ గలకంఠరుతంబులతోడఁ గూడి చో
     ద్యంబుగ వించె ముందటి వనాంతములం దవె శంకరార్ధదే
     హం బడగోలుగొన్నసతి యద్భుతరూపవిలాసగేయముల్.19
వ. అనుచుఁ గొండొకతడవునన తత్ప్రదేశంబు లతిక్రమించి చని మానససరసి
     యుత్తరతటంబున దార్క్ష్యువలన నవతీర్ణుండై యమ్మహాత్ముండు.20
క. అచ్చటిమునులు న్సిద్ధులు, వచ్చి తనుం గాంచి వినయవాక్పూజనముల్
     మెచ్చుగఁ జేయఁగఁ దగుచో, నిచ్చ నిలిచి తపముమీఁది యెసకపుఁగడఁకన్.21
తే. ద్వాదశాబ్దకృత్యం బగువ్రతము నిర్వ, హించుతలఁపున జడలు ధరించి శాక
     మూలఫలకోటి యాహారముగఁ దొదంగెఁ, దన్మయాత్ముఁ డై తాపసధర్మమునకు.22
వ. ఇట్లు ఫాల్గునశుక్లపక్షంబున దీక్షించి యక్షీణంబు లగునిత్యస్నానాధ్యయనధ్యాన
     జపతర్పణహోమబలిప్రముఖంబు లగుననుష్ఠానంబులదెస నలిగరిష్ఠ యగునిష్ఠ
     నవలంబించి యున్నయంబుజోదరునకుఁ గాకోదరద్విషుం డగ్నికార్యప్రయోజ
     నంబు లైనయింధనంబులు దెచ్చియిచ్చు, సుదర్శనచక్రరాజంబు పూజార్థకుసుమం
     బులు గొనివచ్చు, నందకఖడ్గం బఖండితకుశంబుల సంఘటించు, అఖిలాస్త్రంబుల
     తోడ శార్ఙ్గంబు దైత్యదానవభీకరంబై భృత్యభావంబు మెఱయు, అగ్రభాగం
     బునఁ బాంచజన్యంబు సకలదిశలు రక్షించుఁ గౌమోదకి సమస్తవస్తువులు సంసా
     దించుచు సర్వపరిచర్యలుం జేయు నద్దేవుండును నియతభావుం డై.23
క. ఒకనెల నొక్కపదార్థం, బొకనెల వేఱొకటి మఱియు నొకనెలఁ దా నొం
     డొకటి యశనంబుగా నీ, ప్రకారమున నొక్కవత్సరము చరియించెన్.24
వ. రెండవునేఁడును నవులనేఁడు నట్లకాఁ గ్రమంబునఁ బండ్రెండువర్షంబులు గడపి
     పండ్రెండవునేఁటిమాఘమాసంబు నవసానంబునందు.25
క. ప్రణిధానంబున నంబా, ప్రణయుం బశుపతి నమర్చి భక్తి యెలర్పన్
     బ్రణవము రుద్రాధ్యాయము, ప్రణుతమతి జపించుచుండెఁ బర్యాయమునన్.26

ఇంద్రాదిదేవతలు శ్రీకృష్ణుని దర్శించుటకుఁ గైలాసపర్వతంబునకు వచ్చుట

మ. అతిమాత్రంబు తపంబుపేర్మిఁ గృశుఁడై యాపింగరంగచ్చటా
     ధృతి నొప్పారు పురాణసంయమిఁ బ్రభున్ దేవార్చితున్ దేవకీ
     సుతు విశ్వంభరు విశ్వలోకవరదుం జూడంగ నేతెంచి రం
     చితరాజ్యోదయవైభనంబును గడుం జెన్నొంద బృందారకుల్.27
వ. ఇవ్విధంబున నైరావతంబు నెక్కి యెక్కుడుపెంపునం బొదలుభిదురంబుఁ గేల
     నమర నమరీకరకలితకనకదండతాళవృంతానిలంబులు గుంతలంబులు గదల్ప ననల్ప
     మణిమరీచిరుచిరంబు లగుభూషానికరంబులు నయనసహస్రం బను సహస్రదళ
     సముదయంబున నలంకృతం బగుగాత్రంబున రుక్మపరిష్క్రియాచిత్రంబు గావింపఁ