పుట:హరివంశము.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

366

హరివంశము

     కరణంబులు నాయందు సమర్పితంబులు గావించుఁ గావున నవ్విశిష్టకర్మంబ
     పక్వం బై యిట్టిపదం బొదవె వీనిం గృతార్థుం జేయుదు నని నిశ్చయించి.201
క. ఆతతభక్తిసముజ్జ్వల, చేతోదర్పణమునందు సిద్ధంబుగ వి
     ఖ్యాతప్రతిబింబముక్రియ[1]ఁ, బ్రీతిం దనదివ్యమూర్తి వెలయించెఁ గృపన్.202
వ. అట్టి సాక్షాత్కారంబు సంభవించిన నతండు.203
మ. జలజిం జక్రి గృపాణి గార్ముకి గదిన్ సంవీతపీతాంబరున్
     విలసత్కౌ స్తుభవక్షుఁ గుండలవిభావిద్యోతవక్త్రాంబుజున్
     జలదశ్యామశరీరుఁ జారుమకుటస్రగ్గంధమూర్ధు న్నిరా
     కులతార్క్ష్యాంసవిభాసితుం గనియె నాగోవిందు నంతర్గతిన్.204
వ. తదీయమాహాత్మ్యంబును దన బుద్ధిగోచరంబుగా నధిగమించె నిట్లు దేవదేవునిఁ
     బ్రత్యక్షంబుగాఁ గనిన తెఱంగున నంతరంగదర్శనంబున నెఱింగి.205
క. అరమోడ్చినకన్నులు సుస్థిర మగునాసనము నచలదేహంబును న
     ప్పరుసునన యుండఁగా ని, ర్భరసమ్మోదానుభవవిభాసితుఁ డగుచున్.206
మ. హరి నాత్మేశ్వరు విశ్వరక్షకుఁ ద్రిలోకారాధ్యు నిమ్మాడ్కి నే
     నరుదందం దఁగఁ గంటి నెందును గృతార్థారంభ మిక్కార్య మిం
     కరయంగా నొకఁ డెద్ది నీచపుఁ బిజాచావేశముం బాసితి
     న్బరమానందవిధాయి సిద్ధపదముం బ్రాప్యంబ నా కిమ్మెయిన్.207
క. నాయనుజుఁడు ననిశము నా, రాయణచరణాబ్జచింత నాసక్తుఁడ వాఁ
     డాయనువునఁ బరమేశ్వర, సాయుజ్యము పడయుఁ గాత సముపాగతితోన్.208
వ. అని తలంచుచు మున్ను నియమింపఁబడిన శ్రోణపవనంబు నొయ్యన వదల విడిచి
     యోగాసనంబు సడలి శరీరసన్నాహం బెడలి కన్నులు విచ్చి ముందట.209
క. తనయంతఃకరణంబున, వినుతం బగుభక్తియోగవిశదాలోకం
     బునఁ గానఁబడినతెఱఁగున, దనరినయదునాథుఁ గనియెఁ దనబాహ్యమునన్.210
క. ఏపగిదిఁ దలఁచుభక్తుం, డాపగిదిన తోఁచు నీశుఁ డనుపల్కు నిజం
     బై పొలుపుగ నమ్మెయిఁ బొడ, సూపిన పరమాత్ముఁ గృష్ణుఁ జూచి ముదమునన్.211

ఘంటాకర్ణుఁడు శ్రీకృష్ణమూర్తిం బొడగని స్తుతించుట

వ. ఘంటాకర్ణుండు సముత్థితుం డై సమ్మదాట్టహాసంబుతో నర్తనంబు సేసి.212
క. హరిఁ గంటిఁ గృష్ణుఁ గంటిం, పరమేశ్వరుఁ గంటి భక్తభయహరుఁ గంటిం
     బురుషోత్తముఁ డచ్యుతుఁ డీ, శ్వరుఁ డభవుఁడు వీఁడే వీఁడె సమ్ముఖుఁ డయ్యెన్.213
తే. ఏను భక్తితో మనసున నెంతయేని, మరగి వెదకంగఁ దోఁచినమాడ్కి రూపు
     వెలుపలను దోఁచె నీతనివెనుక నింకఁ, దగిలి విడువక బంటనై నెగడువాఁడ.214

  1. నేతర తద్దివ్యమూర్తి నెలయించె