పుట:హరివంశము.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

హరివంశము

క. నీకుఁ బరిభవము గలదే, లోకోత్తర యరయ భక్తలోకములకు లో
     నై కాదె యిట్లు వలికెదు, మాకొలఁదులమతులు దివ్యమతి జొన్పుటకున్.137
వ. దేవర యెంతటివానింగా నవధరించితి వంతటివాఁడనై సర్వోపాయంబులఁ
     బ్రసారభాజనం బయ్యెద ననియె నయ్యాదిదేవుండు బలదేవున కభిముఖుండై
     మహాత్మా నీవు మహాసత్వుండవు మహావిక్రమోద్దీపితుండవు నీపరిపాలనంబున
బ్రతుకు మాకు లోకంబులచేతియపహాసంబు వాటిల్లకుండెడుతెఱం గెయ్యది
     యయ్యనువు దలంపులోనం గదియింపుము.138
క. అని పలికి యతనిసాదర, సునిశ్చితార్థవచనములచొప్పునకు మనం
     బున నెమ్మిఁ బొంది మాధవుఁ, డనంతరమ యుగ్రసేనుఁ డాదిగ వరుసన్.139
వ. యదువృద్ధుల నందఱుఁ బ్రత్యేకంబ సంభావించి వీడ్కొని గమనోన్ముఖుండై
     గరుడునిం దలంచినం దత్క్షణంబ.140
సీ. సర్వపథీనుఁడై చనుపతంగుఁడు గలఁడో కాక యనయ నన్యుఁడు జగమున
     నెఱకలు వడసి యెయ్యేడఁ బ్రవర్తిల్లెడుమేర గాంచెనొ కాక మేరుశిఖరి
     యంబరశ్యామిక యంబుధిపొగరుగా బ్రమసి యెక్కెనొ కాక బాడబాగ్ని
     హైమమై పరగు బ్రహ్మాండంబు పక్వమై తగఁ బుట్టెనో కాక ఖగ మొకండు
తే. వైనతేయుఁడు నీదృశవ్యాప్తి దీప్తు, డాతఁడో కాక యితఁ డని యఖిలజనులు
     బహువిధానుమానారంభపరతఁ జూడ, నరుగుదెంచెఁ బక్షిప్రభుఁ డభ్రవీథి.141
వ. ఇట్లు చనుదెంచి మహీతలంబున కవతరించి ముందటఁ బ్రణతుండును బ్రాంజ
     లియఁ బ్రశంసావచనవాచాలుండు నై యున్నం గనుంగొని.142
క. తనమూర్తియ వేఱొకఁడై , దనునావిహగేంద్రు, నింద్రసము సమధికపా
     వన మగుపాణిపయోరుహ, మున నంటి రథాంగపాణి ముదము దలిర్పన్.143
వ. సౌమ్యచతురుండవై చనుదెంచితే యనుపలుకు పలికి.144

శ్రీకృష్ణుఁడు కైలాసంబునకుఁ బుత్రార్థియై పోవుట

క. శైలాత్మజాసహాయుని, ఫాలాంబకు నఖిలభువనపతి దర్శింపన్
     గైలాసాద్రికి నేఁగెద, నీలా గెఱిఁగింపు మాకు నిరుపమభక్తిన్.145
వ. అని యానతిచ్చిన నయ్యిచ్చ కనురూపంబుగాఁ గొలుపుమాటలు ప్రకటించు
     నయ్యుదంచితదేహు బంధురస్కంధం బారోహించి రోహణశృంగసంగతం
     బగు నీలాంబుదంబు ననుకరించి యాదవుల నందఱ నిలువుం డని పూర్వోత్తర
     దిశాభిముఖుం డగుటయు.146
క. పతిచిత్త మెఱిఁగి యెఱకలు, విశతంబుగఁ బఱపి విహగవిభుఁడు నెగసె న
     ద్భుతముగఁ దనయఖిలబలో, ద్ధతిఁ జూపుటకుం దలంపు దళుకొత్తంగన్.147