పుట:హరివంశము.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 4.

337

క. తనవిద్యాతపములచే, త నుపార్జిత మై పేర్మిఁ దగ నఖిలంబున్
     వినియోగించి విభునిపం, చినకంటె నుదాత్తచిత్రశిల్పము దొడఁగెన్.224
వ. ఇట్లు దొడంగి యెనిమిది యోజనంబులపఱపును బండ్రెండు యోజనంబుల నిడు
     పును నైనయమ్మహానగరి తద్ద్విగుణప్రమాణోపనివేశమహనీయయు ననేకరాజ
     మార్గరథ్యాచరణలలితయు మణికనకభాసురప్రాసాదసహస్రశోభితయుఁ గావించి
     వాసుదేవునగరు నలుదెసల నాలుగుయోజనంబులు గలుగ రచియించి మొగసా
     లలు నరుఁగులుఁ బసిఁడిన తీర్చి యతనిమందిరం బర్ధయోజనవిస్తీర్ణం బై విరజం బను
     పేర నూరు[1]హస్తంబులపొడవునం బొలుపార స్ఫటికంపుఁగంబంబులు వైడూర్య
     పట్టికలు వజ్రకవాటంబులుం గనకకుట్టిమంబులు గరుడాశ్మకుడ్యంబులు గా
     నొనర్చి రుక్మిణ్యాదు లగువారి కెనమండ్రకు వేర్వేఱ తగినగృహంబులు
     నిర్మించి యన్నిటికిం ద్రిదివసవనంబులం గలయొప్పులెల్లఁ దెచ్చిపెట్టి వైజయంతం
     బను నచలంబును షష్టితాలోచ్ఛ్రితం బగుహంసకూటంబును నినమార్గగామి
     యగు మేరుశిఖరంబును లోకంబులు గనుంగొన క్రీడాపర్వతంబులుగా నిలిపి
     దివ్యసరస్సులు దెచ్చి కేళీదీర్ఘికలుగా నునిచి నందనప్రముఖవనంబులలోని తరు
     వులు పెక్కు దెచ్చి శృంగారపుఁదోఁటలో నాఁటి కోటలు గోపురంబులు
     దివ్యంబు లగుసర్వద్వారసంక్రమంబులును దేవాసురుల కసాధ్యంబుగా నంగనల
     కైన నిలిచి కై చేయవచ్చునట్లుగా నపరిమితయంత్రాట్టాలకపతాకాకలితంబులు
     గా సంఘటించి పరిఖలు పాతాళస్పర్శినులును దుస్పర్శతిమిమకరసంకీర్ణలుం బూర్ణ
     సలిలసేవ్యలు సపరిభావ్యసన్నివేశప్రకాశితలుఁగా బచరించి పురంబు తూర్పున
     రైవతకంబు దక్షిణంబున లతావేష్టనంబు పడమట నక్షమయంబు నుత్తరంబున
     వేణుమంతంబును నను గిరులకుఁ గనకశైలకైలాసమందిరంబులు మొదలయిన నగ
     రంబుల నేమేమివిశేషంబులు గల వవియన్నియుం గలుగ నుత్పాదించి వాని
     కెలంకులఁ జిత్రకంబు భార్గవంబు పాంచజన్యంబు పుష్పకం బను దేవోద్యానం
     బులు ప్రతిష్ఠించి నలిని పుష్కరిణి లోనైనసురసరిత్తులు పురపరిసరంబున సాగర
     గామినులుగాఁ గల్పించి యీదృశప్రభావవిభాసితయైన ద్వారవతి యమరావతి
     నతిశయించునట్టిపేర్మి యావహించి దేవశిల్పి దివంబునకుఁ జనియెఁ దదనంత
     రంబ.225

శ్రీకృష్ణుఁడు పారిజాతంబుతో నిజపురంబునకు వచ్చుట

క. చనుదెంచె గరుడగరుదం, చనచంచలసకలభువనసంచయుఁ డగుచున్
     వనజాక్షుఁడు నిజనగరికి, వనితాప్రియపూరణోత్సవపురస్సరుఁడై.226

  1. చేతుల