పుట:హరివంశము.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

336

హరివంశము

క. ఏతరువు సురాభ్యర్చిత, మేతరువు గరం బభీష్ట మింద్రాణికి వి
     ఖ్యాతం బేతరువు [1]నిజవి, భూతిఁ ద్రిభువనంబులం బ్రభూతస్థితులన్.215
క. ఏతరువు సమీపమునకు, నేతేరఁగ నాక్షణంబ యెంతయు నరుదై
     జాతిస్మరత్వ మగు నే, జాతికినే నట్టి పారిజాతముఁ గనియెన్.216
ఉ. అత్తఱి సత్యభామ తను నాదిసురాంగనగాఁ దలంచు చ
     య్యుత్తమదివ్యవాసనసముత్థితయై మది నుల్లసిల్ల పె
     ల్లెత్తిన వీడు నవ్వరమహీరుహముం దనసొమ్ముసేఁతకై
     మెత్తన వేఁడె జిత్తవిభు మేకొని యచ్చతురుండుఁ జెచ్చెరన్.217
తే. పెఱికి పారిజాతముఁ దార్క్ష్యు పెద్దవీఁపు, మీఁద నిడుకొని ప్రియకాంత మెచ్చియలర
     దేవలోకంబు వెలువడఁగా వనంబుఁ, గాచి యున్న కింకరులు పెక్కండ్రు గడఁగి.218
వ. అడ్డపడి యనేకశస్త్రాస్త్రవిలసనంబుఁ జూపిన నవ్వుచు నవ్వీరుండు.219
మ. స్ఫుటశార్ఙ్గచ్యుతతీవ్రబాణపటలస్ఫూర్జత్ప్రభావంబులన్
     ద్రుటితగ్రీవుల దారితోదరుల నిర్లూనాంఘ్రులన్ భిన్నహృ
     త్తటులం జేయఁగఁ గొంద ఱేఁగి యధికత్రాసంబునం జెప్పి ర
     ప్పటుబాహావిభవుం డొనర్చిన క్రియాపర్యాప్తి గోత్రారికిన్.220
క. దేవాధిపతియు మదిలో, నావిభుఁడు త్రిలోకహితసమాచరణకళా
     కోవిదుఁ డగుట యెఱింగి య, థావిధ మగుతత్కృతంబు తగ నొడఁబడియున్.221
ఆ. మనసు పట్టలేక యనిమిషకోటితో, నరిగి యతనిఁ దాఁకి యనియొనర్చి
     వజ్ర మతనిమీఁద వైచి తద్వేగసం, స్తంభనమున మదము దక్కి స్రుగ్గి.222
వ. అమ్మహాత్ముతోఁ దదీయనివృత్తిపర్యంతంబు దివ్యమహీరుహంబు మహీతలస్పర్శిగా
     నొడంబఱచి యమరావతికిం జనియె కృష్ణుండు నిత్తెఱంగునం బారిజాతంబు
     గైకొని నిజపురాభిముఖుం డయ్యె నటమున్న (నరకాసురవధానంతరంబున
     నయ్యనంతగుణమణిపర్వతుండు) యతండు మణిపర్వతాభిగమనం బొనర్చు
     సమయంబున నమరవల్లభుండు విశ్వకర్మ రావించి గోవిందుండు దేవతాహితార్థం
     బనేకసంగ్రామంబుల నచ్చెరువుగఁ బరాక్రమం బాచరించువాఁ డీనాకంబున
     నే నెట్లు విహరింతు న ట్లతండు మర్త్యలోకంబునం గ్రీడింపవలవదే తన్నగరంబున
     కింకను జెలువంబు లక్కజంబుగా నొనర్పుము జగంబుల నెన్నియేని సద్వస్తువులు
     గల వన్నియుం దెచ్చి యచ్చటన యునుపుము నాకుఁ బ్రియంబు సేయవలతేని
     నింతయు శీఘ్రంబ కావించుట కర్తవ్యం బనిన నియ్యకొని యమ్మహానుభావుండు.223

  1. సకల