పుట:హరివంశము.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 4.

331

తే. శయనరతికళావిహరణసమయములఁ బ్రి, యంబుతోడ నర్థించి యెయ్యది పడయఁగ
     నేరకుండుఁ దానును నట్టిచారుకంఠ, భూష గని యప్పు డలరె నప్పువ్వుఁబోఁడి.171
వ. ఇట్లు హృదయేశ్వరి సంభావించి యా దేవుం డద్దేవిచేతి విల్లు గైకొని యుల్లాసం
     బెసంగ సమరంబునకుఁ గడంగె నంతటిలోన నన్నరకాసురుండు వేఱొక్కరథం
     బెక్కి యెక్కుడు మగంటిమిఁ గార్ముకంబు ధరియించి బరవసంబున నడరి యేడమ్ములఁ
     గృష్ణునిఁ బదిసాయకంబుల సత్యభామను గరుత్మంతుని నైదుశరంబుల నేసి
     యార్చిన.172
చ. కినిసి మురారి తద్ధనువు గృత్తముగా నొనరించి సూతునిం
     దునిమి తురంగమప్రతతిఁ ద్రుంచి పతాకధరిత్రిఁ గూల్చుడున్
     దనుజభటుండు చెచ్చెర గదాభుజుఁ డై యరదంబు డిగ్గి వీఁ
     క నడరి బిట్టువ్రేసె హరికౌస్తుభరమ్యవిశాలవక్షమున్.173
క. అమ్మెయిన వైనతేయుని, గ్రమ్మఱ నొకవ్రేటు గొని తగం దిరుగునెడన్
     నెమ్మది నవ్వుచుఁ బ్రభుఁ డొక, యమ్మునఁ దునుమాడె నతనియాయుధవరమున్.174
క. నరకుఁడు మఱియును బట్టిన, పరశుపరిఘశక్తిభిండివాలముసలము
     ద్గరతోమరకుంతాదిక, పరంపరలు వఱపె భువనపతిపై నోలిన్.175
వ. అవియుం దదీయశరవిదళితంబు లగుటయుం దదనంతరంబ తరుశిలాకోటి
     పరఁగింప నన్నియుఁ దునుదూడి యా సర్వజైత్రుం డమ్మహాశత్రుం బరిమార్పఁ
     దలంచి.176

శ్రీకృష్ణుఁడు సుదర్శనచక్రంబుచేత నరకాసురుని ఖండించుట

సీ. ప్రబలసంగరములఁ బలుమాఱు దైత్యదానవదేహదళనపాటవము దనకు
     నభ్యస్తమై సమస్తామరసిద్ధగంధర్వకిన్నరఫణాధరకళత్ర
     కంఠసూత్రంబులు గాచుట వ్రతముగా వెలుఁగొందుచును మహాద్విజతపస్వి
     నియమనిర్వహణైకనిష్ఠ గ్రాలెడు సుదర్శనసంజ్ఞ మగు మహాచక్ర మమిత
తే. విభవనిర్వక్ర మాక్రాంతవిశ్వభువన, చక్ర మఖిలప్రశస్తహస్తమునఁ దాల్చి
     పగతుదెసఁ బూఁచి వైచెఁ బ్రస్ఫారవిలయ, వహ్నిమండలచండమై వఱలఁ జదల.177
మ. వికటస్ఫూర్తిఁ దదస్త్రరాజ మసురన్ వే తాఁకి యాపాదమ
     స్తకసర్వాంగము రెండు వ్రయ్యలుగఁ బెల్బం బాపె ఱంపంపుఁబెం
     పొకడుం దప్పక యుండునట్లు హతుఁ డై యుర్వీస్థలిన్ శోణితో
     దకపూరంబునఁ దేలె దైత్యుఁడు జగత్సంత్రాసవిచ్ఛిత్తిగాన్.178
వ. అయ్యవసరంబున ధరణీదేవి సాకార యై చేరి ఘోరసమరమధ్య నిపతితుం డై
     యున్నసుతుశరీరంబు కౌఁగిలించి యతని కర్ణంబుల సుదీర్ణదీప్తిఁ దేజరిల్లు దివ్యమణి