పుట:హరివంశము.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

324

హరివంశము

     యక్కునం జేర్చి మఱియు యాదవులలోన సమ్మానార్హులైన వారి నెల్లను బరి
     రంభణంబున సంభావించి.111
క. పోరానిచుట్ట మితఁ డనఁ, గూరిమి చెలికాఁ డనంగఁ గోరి వరుస గో
     త్రారి హరిబాంధవులఁ బే, ర్వేరం గుశలంబు లడిగెఁ బ్రియ మెలరారన్.112
వ. బలదేవ పురస్సరుం డై గోవిందుండును బురందరుం దోడ్కొని యతని వేడుక
     పట్టగుసుధర్మలోనికిం దెచ్చి యుచితాసనంబున నునిచి యర్ఘ్యపాద్యాదుల నర్చించి
     తక్కిన లోకపాలుర నుచితోపచారంబు లాచరించె నంత నందఱు నర్హస్థానంబుల
     నుండ నా ఖండలుండు పుండరీకాక్షుకరంబు కరంబునఁ దెమల్చుచుం దదాన
     నంబునఁ జూడ్కి నిలిపి యి ట్లనియె.113

ఇంద్రుఁడు శ్రీకృష్ణుని నరకాసురవధకుఁ బ్రేరేపించుట

తే. ఏను నీయున్నకడకు ని ట్లేగుదేర, వలసినట్టికార్యము సాధువత్సలాత్మ
     దేవకీపుత్ర యుత్తమధీసమగ్ర, కలిగె నొక్కటి యది నీవు తెలియ వినుము.114
చ. నరకుఁ డనంగ దైత్యకులనాథుఁ డొకండు సరోజసూతిచే
     వరములు గాంచి పేర్చి సురవర్గము నెల్లను గాసిచేసె సం
     గరమున నేము వానిభుజగర్వము సైపఁగ లేక యిండులున్
     సిరులుఁ [1]దొఱంగి వచ్చితిమి చెన్నఱి మానుషజాతిలోనికిన్.115
మ. అమరావాసము [2]లెల్లఁ జొచ్చి దనుజుం డభ్యర్చితద్రవ్యజా
     తము లెల్లం బొరిఁ జూఱలాడినకథల్ ద్రవ్వంగఁ బె క్కేమి సె
     ప్ప మహాభంగ మొకండు గల్గె విను మాభంగంబు నీకు న్సమా
     నమె యేఁ జెప్పఁగఁ జిత్తగింపుము జగన్మానోల్లసద్విక్రమా.116
తే. అనపహార్యంబు లెవ్వాని కదితిదేవి, కుండలంబులు సురలోకమండనములు
     గొనియె విబుధాళి వంతలఁ గుందుచుండ, నింతయును మాధవా! నీవ యెఱుఁగుదింక.117
క. ఖలుఁడు మునుల యాశ్రమములు, గలయన్నియుఁ జొచ్చి చెరిచెఁ గ్రతువులు ధర్మ
     స్ఖలనం బొనర్చె సాధుల, యలజడి కిది గుఱుతు కొలఁది యన లే దనఘా.118
వ. ఇంతియకా దమ్మహాదైత్యుండు.119
శా. నీవాశ్చర్యపరాక్రమంబున మహి న్వీశ్వైకరక్షార్థి వై
     దేవారాతులఁ గూల్చుచున్కి విని నీతేజంబు సైరింప కు
     గ్రావష్టంభత నిన్నునుం దొడరి నీ కాజిం బరీభావమున్
     గావింపన్ భవదంతరంబ మది నాకాంక్షిచు నెల్లప్పుడున్.120
క. కావున నూర్జితబాహు, శ్రీ వెలయఁగ నరిగి రిపునిఁ జెఱుచుటయ తగన్
     గోవింద కర్జ మిత్తఱి, నీ విశ్వంబునకుఁ జేయు మిట్టిహితంబున్.121

  1. దొలంగి
  2. లోలిఁ