పుట:హరివంశము.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

హరివంశము

     బరిపూర్ణాత్మకులార నేఁడు నను సంభావ్యాన్వయోదగ్రుఁగాఁ
     గరుణింపంగఁ దలంచు టొక్కటియగా కర్జంబు మీరాకకున్.76
తే. అయిన నిత్తఱి నెయ్యది యైన నొక్క, కృత్య మాజ్ఞాపనము సేయుఁ డత్యుదాత్త
     హృదయులార! యవ్విధి నిర్వహింప నుత్సు, కంబు లైనవి యంతరంగములు మాకు.77
క. అని గోవిందుఁడు పలికిన, యనుపమరసభరితమంజులాలాపనపూ
     జనముఖ్యక్రియతో న, మ్మును లందఱు సంప్రముదితమూర్తులు వెలయన్.78
క. తమతెచ్చిన బదరీఫల, సముదయములు శిష్యహస్తసంసక్తము ల
     క్కమలోదరునకు నుపహా, రముగ సమర్పించి [1]భక్తిరాగాన్వితు లై.79
వ. అంజలిపుటంబులు నిటలంబునం గదియించి దేవా యివి నీవు దొల్లి నరసఖుండ వై
     విహరించినపుణ్యాశ్రమంబు తరువులవలన నానీతంబు లైనవి నీచేతం బూర్వ
     భుక్తంబు లయిన నప్పదార్థంబు లిప్పుడు నీకుం గానుక గావించితిమి మావచ్చిన
     కార్యం బెంతేనియుఁ గల దత్యంతావధానంబుతో నాకర్ణింపుము.80
క. ధరణీదేవి తనూజుఁడు, నరకుఁడు నా నసురవంశనాయకుఁడు పురం
     దరహృద్రోగసముద్యముఁ, డరయంగా సిద్ధసాధ్యయక్షాదులకున్.81

వసిష్ఠాదిమహర్షులు శ్రీకృష్ణునితో నరకాసురుని దుశ్చేష్టలు చెప్పుట

మ. జలధివ్రాతము నైనఁ గ్రోలఁగఁ గులక్ష్మాభృత్సమూహంబు నై
     న లుఠత్కూలము గాఁ గదల్ప [2]భువినైనన్ లోపడం ద్రొక్కఁగాఁ
     బ్రళయోదగ్రకృశాను నైనఁ గబళింపం జాలునాభీలదో
     ర్బలనిష్ణాతుఁ డభీతుఁ డాతతభయోత్పాతప్రభావుం డిలన్.82
వ. అద్దురాత్ముండు త్రైలోక్యపరాభవకరణంబ తనకు వినోదంబుగా నెందునుం జరి
     యించువాఁ డొక్కసమయంబున బదరీవనంబునకుం జనుదెంచి యజనతత్పరవృత్తి
     నున్న మముఁ గనుంగొని యిట్లేల బేలుదనంబున వేల్పులగుఱించి వేల్చెదరు యజ
     నంబులకు భాజనం బేన కాక యన్యు లెవ్వరు గలరు కర్తవ్యంబు లన్నియు నన్ను
     నుద్దేశించి చేయుం డని పలికిన మాపలుకు నుత్తరంబులకు నలుక వొదమి తన
     యనుచరులం గనుగిలిపి వనిచి వారునుం దానును.83
తే. అగ్ను లార్చి హోతల నొంచి యఖలయోగ్య, వస్తువిస్తారములును విధ్వస్తములుగఁ
     జేసి యాఁడువారలనెల్లఁ జెఱులువట్టి, కొనుచుఁ[3]బోయె నేమని చెప్ప ననఘశౌర్య.84

  1. రోతి
  2. విభునైనం బ్రోపడం
  3. బోయి రే మని