పుట:హరివంశము.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

హరివంశము

     నొందుటకు నధికతమశ్శీలు రగు బ్రాహ్మణులు పరిపీడితు లగుటకుఁ బాతివ్రత్య
     [1]భూషణం బగు యోషిద్గణంబు దూషణంబునం బడుటకును డెందంబు లెరియ
     నందఱుంగూడి విచారించి.58
క. [2]ఈ చందంపుఁ జెయిది యి, న్నీ చుఁడు నొనరించెనేని నిఖలజగంబుల్
     వే చెడు మన [3]కిఁక నొక్కఁడు, గాచుప్రభుఁడు లేకయున్నఁ గలవే బ్రతుకుల్.59
మ. అడియాసం దొలఁగంగఁజాల కిటు ఘోరావస్థపాలైతి మే
     ర్పడఁ ద్రైలోక్యము గావఁబూని యవతారక్రీడ గైకొన్నవాఁ
     డొడయం డా వసుదేవసూనుఁ డజుఁ డాద్యుం డచ్యుతుం డాతనిన్
     గడు[4]భక్తిన్ ముపాశ్రయింపఁగ నగుం గల్యాణ మెబ్భంగులన్.60
క. [5]ద్వారవతి కేఁగి మన మీ, దారుణవిధి సెప్పఁ దడవ తడయక కడిమిన్
     దా రక్షకుఁ డై కడఁగు ను, దారపరాక్రముఁడు చక్రి దయ దళుకొత్తన్.61

వసిష్ఠాదిమహర్షులు ద్వారకకు వచ్చుట

వ. ఇంక నాలస్యం బేల లెండు గదలుం డని పయనంబున కాయితం బైయందఱు
     వృద్ధపురస్సరంబుగా దక్షిణాభిముఖు లై నడచి యెడనెడఁ బుణ్యతీర్థంబుల నవ
     గాహనంబు సేయుచు దైత్యావమానదూనంబు లైన మానసంబుల
     దేర్చుచు భాగీరథి సేరి యం దభిషిక్తు లై సర్వప్రాయశ్చిత్తంబులు గని యంతట
     నుండి నిత్యప్రయాణంబులం జని.62
సీ. త్రిదివంబుకంటె నుద్దీపితం బై విశ్వకర్మమానససృష్టి కలన నగుట
     యంభోధిపరిఘయై యలరార దేవతాదులకు నసాధ్యంపుదుర్గ మగుట
     [6]తనునేలువాఁడు నిత్యస్థిరలక్ష్మితోఁ బ్రాణేశుఁ డై జగద్భర్త యగుట
     హరుకోపశిఖఁ గ్రాఁగి యడఁగినమదనుండు తనయందుఁ దనుసిద్ధి ధన్యుఁ డగుట
ఆ. దనక కాని వేఱు ధరణీతలంబున, నితరనగరములను నెందు లేక
     [7]యుల్లసిల్లి యనుపమోదాత్తవిభవమై, పొలుచు యాదవేంద్రుపురము గనిరి.63
వ. కని తదీయవిభూతికి నద్భుతంబు నొందుచుఁ గృతప్రవేశు లై యందఱు రాజ
     మార్గంబున నల్లన యరిగి నగరివాకిట నిలిచి పణిహారులతో బదరీవననివాసు లగు
     తపస్వులు వచ్చినా రని దేవరకు విన్నపంబు సేయుం డనిన వారు లోపలికిం జని
     యవ్విధం బట్ల సేయుటయు.64
క. మునివరులరాక విని తన, మనమున సంభ్రమముతోడ మధురిపుఁడు గుమా
     రునిఁ బ్రద్యుమ్నుని జెచ్చఱఁ బనిచె[8]న్ దదనునయమునకుఁ బరమప్రీతిన్.65
తే. అతఁడు వారి నెదుర్కొని యాదరమున, సంప్రవేశంబు నడప నాసౌమ్యచరితు
     లరుగుదెంచి సుధర్మాఖ్య యగు మనోజ్ఞ, దివ్యసభ నున్నయట్టి యా దేవపూజ్యు.66

  1. భూషణలగు
  2. ఏచందము సేయుద మి
  3. కింకొక్కఁడు
  4. రక్తిన్
  5. ద్వారావతికిం జని యీ
  6. సుగతి నేలెడువాఁడు సుస్థిరలక్ష్మికిఁ
  7. యరయ నుల్లసిల్లు ననుమోద
  8. ఁదదానయనమునకు