పుట:హరివంశము.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

హరివంశము

తే. ఇతనివలననె యుగములం దెల్ల సుప్ర, తిష్టమై యాద్యధర్మంబు దేజరిల్లు
     సిరియుఁ గీర్తియు జీవితపరమగతియు, నితనిఁ జెందియ మెఱయ నూర్జితవిభూతి.84
ఉ. ఈతని పాదపద్మముల కే ననిశంబును భక్తియుం బ్రియ
     త్వాతిశయంబు నొప్పఁగ సమంచితసేవ యొనర్తు నంబుద
     స్ఫీతమనోజ్ఞమూ ర్తి కనపేతదయావిభవైకవర్తి కు
     ద్యోతితకీర్తి [1]కీతనికి నుత్తమదాస్యనిరూఢిఁ జిక్కితిన్.85
వ. అని యి ట్లాదేవు దివ్యమహిమ లన్నియు ము న్ననేకవిధంబుల వినికిం జేసి
     యద్దేవి [2]నిశ్చించలం బగునిశ్చయంబున నిరపోహతృష్ణయై నిలిచెఁ గృష్ణుండు
     నట ముందట సంకేతించినవాఁడు గావున నపుడు దన్నుఁ గూడ[3]వచ్చిన బల
     దేవున కొక్కింత యెఱింగించి.86
తే. నెచ్చెలులలోన నున్నయన్నీరజాక్షి, నొదవువేడుక నొయ్యనఁ బొదివిపట్టి
     తెచ్చి రథమున నిడఁగఁ దదీయసఖులు, గలఁగి రచ్చటిసైన్యంబు గలిసె మీఁద.87
క. తరు వొకటి వెఱికి లాంగల, ధరుఁ డుద్ధతిఁ బూంచి హయరథద్విపసుభటో
     త్కరముల మ్రగ్గింపఁగ న, న్నెరవులు వచ్చుటయు మేదినీధరుఁ డలరెన్.88
వ. అమ్మహోత్సాహం బెఱింగి యుగ్రసేనుండు సాత్యకి శతద్యుమ్నుండు విదూ
     రథుండు ప్రసేనజిత్తు మొదలయిన యదువృష్ణిభోజాంధకవీరు లనేకు లనేకరథ
     తురంగదంతావళసహస్రంబులతోడం బన్ని యేతెంచి రామపురస్సరు లై నిలిచి.89
క. ద్వారావతి కరుగుము గ, న్యారత్నముఁ గొనుచు నీవు నలినాక్ష మహా
     వైరుల నందఱ నేమ ని, వారించెద మనుచు దుర్నివారస్ఫూర్తిన్.90
వ. సమరంబునకుం బ్రవర్తిల్లిరి హతశేషు లైన కన్యారక్షకు లరిగి జరాసంధునకు
     రుక్మికి భీష్మకునకుం బౌండ్రకునకు శిశుపాలునకు దంతవక్త్రునకు మఱియునుం
     గల రాజుల కెల్లను బ్రత్యేకంబ రుక్మిణీహరణం బెఱింగించిన విని యద్భుతంబు
     నొంది రప్పు డచ్చటి జనంబులు.91
తే. ఎట్టిలా వెట్టిదీమస మెట్టితెగువ, యెట్టికడిమి కృష్ణుఁడు జగదేకవీరుఁ
     డగుచు నీకూడియున్న ధరాధిపతుల, భంగపఱిచె నిం కే మని పలుకఁగలదు.92

శ్రీకృష్ణుఁడు రుక్మిణీదేవిం గొనిపోవునెడ జరాసంధాదు లెదిరి పోరుట

క. అని రత్తఱి మగధేశ్వరుఁ, డనయము కన లగ్గలింప నౌడు కఱచి కెం
     పున నుగ్రము లగుచూడ్కుల, జననాథుల కిట్టు లనియె [4]సంభ్రాంతమతిన్.93
ఉ. వ్రేనితనూజుఁ డొక్కఁ డతివీర్యసమగ్రుఁడ పోలె వచ్చి నా
     [5]పూనినపూన్కి యంతయును బొం కగునట్లుగఁ జేసె నేను నా

  1. యాతనికి
  2. నిశ్చయం బగునిశ్చలంబున
  3. నరుదెంచిన
  4. సంభ్రాంతగతిన్; సంభ్రాంతిమెయిన్.
  5. పూని యంతయు న్నిపుడు