పుట:హరివంశము.pdf/337

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 3.

289

తే. తలిరు సెజ్జలు జందనసలిలవృష్టి, [1]యబ్జదళకృతవీజనం బాదిగాఁగ
     సఖులు గావించె శిశిరోపచారవిధులు, గొనక నిగుడెడితాపంబు వనజముఖికి.43
చ. హరి నఖిలేశ్వరేశ్వరు దయానిధి నాశ్రితరక్షణైకత
     త్పరుఁ దగఁ బొందఁ గన్నఁ దనుదాహము గ్రక్కునఁ బాయు నొండు దు
     ష్పురుషులఁ బేరుకొంచు మది చూఁడెద రేని లతాంగులార యే
     నురువుదు నీక్షణంబ యుసు ఱోర్వజుఁడీ యను నింతి బోటులన్.44
తే. అబల [2]యివ్విధమున నున్న యయ్యవస్థఁ, గనిన యెవ్వారిమనసైనఁ గనికరమునఁ
     గరఁగు నైసర్గికాత్యంతకరుణమతివి, నిఖిలవేది వుపేక్షింప నీకుఁ దగునె.45
క. కావున ముద్దియప్రాణము, గాపుము నీవిభుత కింత గడవఁ గృతార్థీ
     భావం బన నొండెయ్యది, భూవనుతచరిత్ర యేను బోయెద నింకన్.46
వ. అని చెప్పి యప్పురాణతపస్వి తపస్సిద్ధ యగుసిద్ధగతిం జనియె ననంతరంబ యంబుజ
     నాభుం డాత్మీయజనంబుల నందఱఁ గనుంగొని.47
క. వింటిరె నారదువాక్యము, గంటిరె మనకు నిట వలయుకర్జములను నీ
     వెంట జయకీర్తిశుభములు, గంటకు ముని పనిచెఁ దడయఁగా నేమిటికిన్.48
వ. ఇమ్ముహూర్తంబునంద పయనం బై కుండినపురంబునకుం జనవలయు మీమీ
     వాహనంబుల నాయితంబు చేసి యెక్కి నిజసేనాసమన్వితుల రై నడువుండు సకల
     బలంబులకు ముందట సాత్యకియును నడుమ బలభద్రదేవుండును వెనుకదిక్కున
     జననాథుఁడును జనువా రేనును దారుకైకసహాయుండ నై సర్వాయుధంబులు
     ధరియించి ముందట నరిగి జరాసంధపరిపాలితుం డై యున్న శిశుపాలుం దొలుత
     గాలగోచరుం గావించి రుక్మిప్రముఖక్షుద్రక్షత్రంబు నఖిలంబును నిరవశేషంబు
     చేసి భోజరాజతనయం గైకొనియెద ననినం దదీయశాసనంబున.49
శా. యాత్రాదుందుభి సర్వదిక్కుహరభేదాభీలనిర్ఘోషమై
     జైత్రోత్సాహము దెల్పఁ బొల్పుమిగులన్ సన్నద్ధులై యాదవుల్
     ధాత్రీకంపనసైన్యసంచరణసిద్ధప్రక్రియ న్వెల్వడన్
     శత్రుచ్ఛేద[3]వధిత్సుఁడై విభుఁడు తత్సామగ్రికి న్మెచ్చుచున్.50
సీ. కౌస్తుభమాణిక్యకమ్రాంశువులు మేనఁ గుంకుమక్షోదంబు కొమరు నొసఁగఁ
     గనకాంబరాంచలఘనకాంతి దిగ్భిత్తి లేఖల హారిద్రలిప్తి పఱపఁ
     బాంచజన్యద్యుతిపటలంబు గెలఁకులఁ బూర్ణచంద్రాతపస్ఫూర్తి నెఱప
     వైజయంతీధామవైభవం బురమున గగనస్థసురచాపకలనఁ జూపఁ
తే. బరమకల్యాణవేషవిభాజమాన, మూర్తి యదుచక్రవర్తి యామోదకీర్తి
     వెడలె సైన్యసుగ్రీవాదివిశదరథ్య, రభసదుర్వార మగుదివ్యరథముతోడ.51

  1. యబ్జినీదళవీజనం బాది
  2. యివ్విధంబునఁ బడియెడు నయ్యవస్థ
  3. విలిప్సుఁడై