పుట:హరివంశము.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - తృతీయాశ్వాసము

     కంఠచరణసేవక
     వైకుంఠ గుణావదానవర్ణననిపుణా
     శ్రీకంఠబాహువిభవ
     వ్యాకుంఠితవైరిధామ [1]యన్నయవేమా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు నిజేచ్ఛావశత్రిభువన
     విభవుం డైన యయ్యదువీరుండు ప్రభూతస్థితిం బొందియుండ ననతిచిరం బగు
     కాలం బరిగిన.2
క. రైవతుకూరిమికన్నియ, రేవతి నసమానరూపరేఖావినయ
     శ్రీవినుతఁ బెండ్లియై బల, దేవుఁ డలరె జనకవాసుదేవానుజ్ఞన్.3
వ. తదనంతరంబ విష్ణుదేవుండును వివాహవైభవం బంగికరించె నవ్విధంబు
     వివరించెద.4
సీ. విను వింధ్యపర్వతంబునకుఁ దక్షిణపార్శ్వమునఁ గుండినం బనుపురము రాజు
     గ్రథకైశికాన్వయప్రభవుండు వైదర్భుఁ డకలంకయశుఁడు భీష్మకుఁ డనంగఁ
     [2]దనరారునృపతికిఁ దనయుఁడు రుక్మి యవార్యశౌర్యుఁడు ద్రుముఁ డనునరేంద్రు
     వలనఁ గృతాస్త్రుఁ డై వెలసి బ్రహ్మాస్త్రంబు జమదగ్నిసూనుచే నమరఁ బడసి
తే. శౌరితో నెల్లనాఁడు మచ్చరముచేయు, చుండు నాతనిసోదరి యుజ్జ్వలాంగి
     రుక్మిణీదేవి యసమానరూపయావ, నమునఁ ద్రైలోక్యముల నభినంద్య యయ్యె.5
చ. హరి కనురాగపాత్ర యగునట్టిది యట్టె ప్రసూనబాణవి
     స్ఫురితపునర్భవంబునకు భూమి యనం దగునట్టె సన్మునీ
     శ్వరులకు నర్చనీయ యటె వర్ణనసేయ వశంబె పూని యె
     వ్వరికి నుదాత్తచిత్త యగువారిజలోచన పుణ్యభావముల్.6
క. ఆవెలఁది నాప్తజనముల, చే విని కామించె నాత్మసితకమలాక్షుం
     డావిభుపై నప్పొలఁతియు, భావము గదియించె శ్రవణపరిచయలీలన్.7
చ. తలఁపులు చిక్కు [3]జీరువడఁ దాల్ములు పెల్లగిలంగఁ జూడ్కు లా
     కులపడి [4]చూపు పండువులు గోరఁగఁ గోర్కులక్రందుచేష్టితం
     బులఁ దడపెట్ట భావములపూఁపు బయల్పడ వారి నిద్దఱన్
     బలసి మరుండు తుల్యరసపాకముతీపులఁ గ్రోల్చి విన్కలిన్.8

  1. అన్నను
  2. దనరునా
  3. సిక్కి బీఱు
  4. చూపుచుం జవులఁ గోరిక