పుట:హరివంశము.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 2.

283

తే. నతిరథోత్తము దారుకు నాత్మరథము, గడప సారథిగాఁ జేసి కడిఁదివీరు
     నస్త్రవిద్య ద్రోణాచార్యునంతవాని, [1]సకలయోధముఖ్యుఁడుగ సాత్యకి నొనర్చి.186
వ. ఇవ్విధంబున విధేయంబు లగు సంవిధానంబు లన్నియు నొక్కటం గొరంతవడక
     యుండ నిర్వర్తించి తనశాసనంబున వృష్ణికులైశ్వర్యం బనపహార్యంబుగా
     నమ్మహనీయతేజుం డపరాజితశౌర్యంబున విభ్రాజితుం డై సంతసిల్లె నని వైశం
     పాయనుం డొనర్చిన యుపన్యాసంబు పరిస్ఫుటోల్లాసంబుగా.187
మందాక్రాంతవృత్తము. కాంతాశేషక్షితితలభుజాకాంతకాంతాజయంతా
     చింతారత్నోదయసమగుణస్ఫీతసమ్యగ్వినీతా
     దాంతానంతద్విజకులహితోదార్యగాంభీర్యధుర్యా
     కాంతారాంతర్గమితవిమతక్ష్మాపదీప్తప్రతాపా.188
క. బహుజలధిద్వీపాంతర, మహీశ్వరప్రహీతకనకమణిమౌక్తికహ
     స్తిహయాద్యర్పణసేవా, బహుమతమల్లరధినీశభక్తిప్రీతా.189
మాలిని. అగణితగుణరత్నా హారిధర్మప్రయత్నా
     జగదభినుతభోగా సత్యనిత్యానురాగా
     మృగపతిసమశౌర్యా మిత్రనేత్రాబ్జసూర్యా
     విగణితభయలోభా విశ్రుతైశ్వర్యలాభా.190
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీసూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
     ప్రణీతం బైన హరివంశంబున నుత్తరభాగంబునందు ద్వితీయాశ్వాసము.

  1. నఖిల