పుట:హరివంశము.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

హరివంశము

వ. ఇవ్విధంబున సంకర్షణలాంగలాకర్షణంబునకు వశగత యై వికీర్ణశైవాలకేశియు
     విలోలమానదృష్టిపాతయు విగ్రస్తఫేనదుకూలయు విహ్వలనిహంగరుతాక్రం
     దయు వికలకలహంసగమనయు వికంపితకోకస్తనయుగ్మయు విషణ్ణసరోరుహ
     వదనయు విభిన్నవీచీవళీవిలసనయు వికలితావర్తనాభియు నై విభుకరాకృష్య
     మాణ యగువిముగ్ధయుం బోలె నరుగుదెంచి యాతటిని యాతని యెదుర
     నాత్మీయదివ్యాకారంబు దాల్చి నిలిచి విరచితాంజలి యై యి ట్లనియె.91
క. శరణమ్ము గమ్ము నీదగు, చరణ మ్మిదె శిరముసోఁక సంప్రార్థన త
     త్పరత నొనర్చెద హలధర, హరిపూర్వజ చక్కఁ జూడు నాతుర నన్నున్.92
క. స్వాభావికజాడ్యమున మ, హాభాగ భవన్నియుక్తి యాత్మ నెఱుఁగ కే
     నీభంగి నైతి నలుగుదు, రే భామల కితరు లట్ల యిట్టి మహాత్ముల్.93
ఉ. జీవితభర్త యై పరఁగుసింధువుఁ గూడఁగఁ బాఱకుండ బృం
     దావనమధ్యభూమికి నుదారుఁడు రాముఁడు గ్రమ్మఱించెఁ దా
     నేవిధిఁ దప్పు సేయ కీటు లే లగు నిన్నది యంచు నింక ఫే
     నావలిరోచుల న్నగుచు నార్వరె నన్ను సపత్ను లందఱున్.94
క. అపచారనిదర్శక మగు, విపరీతగతంబు నాకు విశ్వజగమునం
     దపకీర్తికరం [1]బిది నీ, కృపగల్గినఁ జాలు [2]నింకఁ గిల్బిషభేదీ.95
వ. క్రమ్మఱ నేను బూర్వమార్గప్రవర్తిని నగునట్లుగా నానతిచ్చి పనుపు మిమ్మహా
     సిరవిదారణరభసం బుపసంహరింపు మనిన నవ్వుచు నవ్విభుం డవ్వెలంది నాలో
     కించి నీవు వేఁడికొనుటం జేసి వాఁడి యలుక యొకింత సైరణ సేసెదం గాని నీ
     తప్పున కెప్పగిది దండచండతయుం జాల దది యట్లుండె నీ వింతట నిలిచి యెల్ల
     కాలంబును నే నిచటికిం దిగిచిన యిప్పాయవలన బృందావనప్లావనం బొనర్పుము
     నాకు ని ట్లయిన నత్యంతశాశ్వతం బగు యశంబు సిద్ధించు భవన్తుఖ్యప్రవాహంబు
     వాహినీశ్వరగామి యగుం [3]గావుత మని యనుగ్రహించుటయు నిగ్రహవిముక్త
     యై యయ్యగ్రతటిని యాత్మేచ్ఛం జనియెఁ గాళిందీభేదనప్రభావంబు గనుంగొని
     గోపాలు రందఱు నచ్చెరువునొంది యయ్యమానుషసత్త్వశాలి ననేకవిధంబులం
     బ్రస్తుతించి రవ్విధంబున నాశ్చర్యకర్మకలనాధౌరేయుం డైన యారౌహిణే
     యుండు.96

బలరాముఁడు వ్రేపల్లెనుండి మధురాపురంబునకు వచ్చుట

క. వెండియుఁ గొన్నిదినంబు ల, ఖండితరాగమున గోపకప్రకరములో
     నుండి హరిఁ దలఁచి కౌతుక, కండూలం బైన మనసు కడుఁ దమకింపన్.97
తే. వ్రజనివాసుల నెల్లను వరుసతోడ, వీడుకొని తన్ను నందఱు వేడ్క ననుప
     మధుర కేతెంచి వ్రజములో మరిగి తాల్చి, యున్న[4]వేషంబ యెంతయు నొప్పు నొసఁగ.98

  1. బగు
  2. బాయుఁ
  3. గాక యని
  4. వేషము నెంతయు