పుట:హరివంశము.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

హరివంశము

తే. గదుఁడు చేదినాథునినొంప గదుని [1]నొంచెఁ, జేదినాథుండు బహుళాస్త్రమేదురాంధ
     తమసనిర్మగ్న మయ్యె రోదసీతటంబు, సకలభూతావళియు భీతిచలిత మయ్యె.51
క. కొండొకవడికిం జైద్యుఁడు, కాండపరంపరల విరథుఁ గావింపఁగ భీ
     తుండై యాదవుఁ డరిగె న, ఖండితశౌర్యుఁ డగుశౌరికడకు రయమునన్.52
క. శంభుఁడు భూరిభుజాసం, రంభంబున దంతవక్త్రుఁ బ్రకటశరసము
     జ్జృంభణగోచరుఁ జేయఁగ, సంభరితాస్త్రములఁ బొదివె శాత్రవు నతఁడున్.53
సీ. సాత్యకి యత్యుగ్రశరముల విందానువిందుల వెసఁ బరివితతతనులఁ
     జేయంగ నతనిపై నాయవంతీశులు వివిధాస్త్రజాలంబు వెల్లిగొలిపి
     విలు ద్రెవ్వ [2]రథహయంబులు నొవ్వ సారథి దలరఁ బ్రస్ఫుటశక్తికలన సూపి
     రతఁడు వేఱొళవింట ననువిందు విరథుఁగా నొనరింప నిద్దఱు నొక్కరథము
తే. నంద యుండ నత్తేరును నపహతముగ, నాచరించి గ్రక్కున నొక్కయక్కజంపు
     గద యమర్చివైచినఁ దొలఁగంగనుఱికి, పోయి రోటమికోర్చి యబ్భూపసుతులు.54
వ. శతద్యమ్నుం డేకలవ్యుపై సప్తనారాచంబు లేసిన నమ్మేఁటిమగండు దానును
     నన్నియ తూపు లతనిపై నాటించెఁ గ్రమంబున నేడింటను ముప్పదింటను
     నతండును నాతండును నొండొరుల నొప్పించి యొకళ్లోకళ్లవలన విరథత్వంబు
     నొంది గదాహస్తు లై యనేకమండలభ్రమణంబులం బరస్పరాంగంబులు పరిక్ష
     తంబులు గావించి మెఱయుచుం బెద్దయుం బ్రొద్దు పోరునెడ యాదవుండు గ్రమం
     బునఁ బ్రతిభటుని చేతికయిదువు విఱుగునట్లుగా వెరవుతోడి వ్రేటుగొనిన నతండు
     గదాశకలంబు సయ్యన నురివి గాఢముష్టిం దద్భుజాంతరపీడనం బొనర్ప నవ్వీ
     రుండును నవ్విధంబువాఁడ యై నిలిచె నట్లిరువురు బాహుయుద్ధంబునకుం దొడంగి
     కిట్టియుం బట్టియుం బొడిచియు నడిచియుఁ ద్రోచియుఁ దాచియు డాసియు
     వ్రేసియు జానుకూర్పరతలప్రహతుల బాహూరుపీడనంబులం గేశాకర్షణనఖదంత
     [3]ఘాతంబులను సరిగాఁ బెనంగిరి కొండొకసేపునకుఁ గృష్ణబాంధవుండు జరాసంధ
     బాంధవుని నతినిబిడబంధం బగు బంధురముష్టి నూరుసంధి యుఱక పొడిచినం
     బగతుండు గన్ను దిరిగి నెత్తురు గ్రక్కుచు గ్రక్కున నొఱగి యంతలోనన సంబ
     ళించుకొని యెగసి పోకు పోకు మని యార్చుచుం గడంగిన నద్దెసయోధు లతని
     కడ్డంబు సొచ్చి రిద్దెసవార లతనిం గైకొని వారిం దలపడి రయ్యురవడిఁ గయ్యంబు
     సందడి యగ్గలంబయ్యె నిత్తెఱంగున.55
క. ఎక్కటి పెనఁకువ లెన్నఁగఁ, బెక్కులు గడు నక్కజములు భీషణములు నై
     యొక్కటఁ జెల్లగ ననిమిష, దృక్కౌతూహలము లధికతృప్తి వహించెన్.56

  1. దునిమె
  2. హయరథంబులు
  3. పాతనంబుల