పుట:హరివంశము.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - ద్వితీయాశ్వాసము

     మాద్యదంధ్రదేశ
     క్షేమదకరవాల సుజనకీర్తితగుణలో
     లా మంజులవాగ్జాలా
     వేమక్షితిపాల నిత్యవిజయవిశాలా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు జరాసంధు పలాయనం
     బాకర్ణించి జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.2
సీ. అఖిలసైన్యములు సహాయులు గూడంగఁ గృష్ణుచే నపజయక్లేశ మొంది
     యేమని తనవీటి కేఁగె నమ్మగధేశుఁ డకట యిమ్మెయినన మంతమేది
     యవనీపతుల కెల్ల నగ్రణి యనిఁ బాఱిపోక కర్జంబుగఁ గైకొనంగఁ
     జనునె శత్రులవెంట మునుఁ దాన గదలి యవ్వీరులు నెగువంగ వెన్నుసూపి
తే. పఱచు టెంతయు సిగ్గఱి బాముమాలి, యేమిటికిఁ గాక చెడుట దా నెఱుఁగఁ డొక్కొ
     [1]యిట్లు వోయినపిమ్మట నెట్టు లయ్యె, నివ్విధం బెఱిఁగింపు మునీంద్రవంద్య.3
వ. అనిన వైశంపాయనుం డి ట్లనియె నట్లు పరాజయంబు నొంది చనిన జరాసంధుండు
     లజ్జావనతవదనుం డగుచుఁ బురంబు సొచ్చి నిరుద్ధోరగంబుపోలికం బొరలి నిశ్వ
     సింపుచు నశ్రాంతచింతాకులత్వంబునం జిత్తసమాధానంబు వడయ నేరక యొక్క
     నాఁడు భూపతుల నందఱం బిలుపించి వారి కి ట్లనియె.4
మ. ప్రతికూలంబయి దైవ మెంతయును బాపం బాచరింపంగ ను
     ధ్యతమైనప్పుడు పౌరుషం బతిసమర్థం బయ్యు నత్యంత దు
     స్థితిఁ బొందెం గనుఁగొంటిరే మనమహోద్రేకం బనేకక్రమా
     ద్భుతమై పేర్చియు నట్లు గోపశిశువుల్ దూలింపఁ దూలెం దుదిన్.5
వ. మన కిప్పు డైన తేజోహాని భూతసర్గంబు గల యంతకాలంబును శాశ్వతం బై
     యుండు నిది యపనయింప నుపాయం బొం డెయ్యది యెయ్యనువున నైన
     నయ్యాదవుల వధియించుట నాకుం గర్తవ్యంబు.6

  1. యిట్లు వోయి పిమ్మట నాతఁ డెట్టు