పుట:హరివంశము.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

హరివంశము

క. అంతఁ దెలిసి యసురద్విషుఁ, డెంతయు రభసమున శత్రు నెదిరి కదిసి దు
     ర్దాంతగతి వ్రేయఁగా మిసి, మింతుఁడు గా కాతఁ డొకసమిద్ధపుశక్తిన్.134
తే. అయ్యదూద్వహుపై వైవంగ నది వెరవున, నొడిసిపట్టి యాబలియుఁ డత్యుగ్రలీల
     మగుడ నతనిన వైచె నమ్మగధపతియు, సొలసి వ్రాలి యాలోనన తెలిసి నిలిచి.135
క. పరిఘము గొని మధురిపుపై , నురవడిఁ గవియంగ బాణ మొక్కటి యేసెన్
     హరిశార్ఙ్గము దెగనిండం, దిరముగఁ గొని దాన రిపుఁడు ధృతిసెడి నిలిచెన్.136
వ. అయ్యవసరంబున మూర్ఛదేఱి బలభద్రుండు భద్రగజంబు ధరణీరుహంబుదెసకుఁ
     గవియు విధంబున జరాసంధు నిప్పుడ యున్మూలుం జేయవలయు నని పలుకుచు
     నలుక యెసఁగం గవిసినం గని దరదుం డను భూవరుం డడ్డంబు సొచ్చి.137
ఆ. వరముపేర్మి నితఁ డవధ్యుం డెవ్వారికి, నతులశౌర్యధుర్యుఁ డధికధీరుఁ
     డెట్లు నీవు సంపె దే నుండఁగా నాదు, బలిమి రామ మున్ను దెలియ వెట్లు.138
వ. అని యదల్చినం గినిసి సంకర్షణుండు రిపుప్రాణాకర్షణం బగు తనలాంగలం
     బమర్చి వాని నెదిర్చినం బరిఘపాణి యై వాఁడునుం దాఁకె నయ్యిరువురకు
     నొక్కింతసేపు గజయూధపతులకుంబోలె నాభీలం బగు కలహంబు సెల్లె నంత.139
తే. స్కంధపీఠంబు మీద నాఁగలి దగిల్చి, కిట్టి పగతుని నిల బోరగిలఁ బడంగఁ
     గడిమిఁ దిగిచి మ్రోఁకాళులఁ గలయఁ గ్రుమ్మి, చదిపి నెత్తురు మెదడును జెదరఁ జంపె.140
క. మనుజేంద్రుఁడు మగధేశుఁడు, గనుగొనుచుండంగ నిట్లు గడుఘోరవిధం
     బునఁ బేర్చినబలునిబలం, బునకుఁ దలఁకి కలఁగె నఖిలభూపబలంబుల్.141

జరాసంధుఁడు సకలరాజ్యసమేతంబుగఁ బరాజితుఁడై పోవుట

వ. కృష్ణుండును గ్రోధరభసోద్దాముం డై కౌమోదకి యాయితంబుగాఁ బట్టి యిల
     చలింపంద్రొక్కుచు నక్కజంబుగా నడరి జరాసంధుసంధిబంధంబు బిట్టువ్రేసి
     బెడిదంపుఁ బిడికిటం బొడిచి యుఱక యఱచేతం జఱిచిన మ్రోఁకరిల్లఁబడి
     తూలుచు నతండు నేతిగద ప్రిదిలిపడ సశరం బగు శరాసనంబును సపరికరం
     బగు నరదంబును దిగవిడిచి యపసరణంబ శరణంబుగా సందడి నడంగిపోయినం
     గలంగి రాజన్యు లందఱు సమెటలు పెట్టి గుఱ్ఱంబులం దోలియు నంకుశంబు
     లూని యేనుంగులం దఱిమియుఁ జేరుకోలల నడచి రథ్యంబులం బఱపియు
     నత్యంతభయార్తు లై నలుదెసలం జనిరి సర్వసైన్యంబులుం జెల్లాచెద రై కన్నవి
     కన్నదెసలం బాఱె నట్లు నరేంద్రసహస్రసంత్యక్తం బై విగతసంగీతం బగు రంగ
     స్థలంబును గ్రేణిసేయు సంగరప్రదేశంబు గైకొని.142