పుట:హరివంశము.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

హరివంశము

     మహీధరం బహీలోకగతం బగు సలిలంబు వెలిఁ బేర్చి తొప్పఁదోఁగె నివ్విశే
     షంబువలన విద్వేషికృతం బగు దహనోపప్లవంబు ప్రశాంతం బయ్యె నప్పుడు.96
తే. మందరాద్రులు రెం డొక్కమాటుపడిన, కొలఁది కగ్గలముగ బిట్టు గలఁగుజలధి
     పోల్కి రామకృష్ణాపాతభూరివేగ, సంక్షుభిక మయ్యెఁ బార్థివసైన్య మెల్ల.97
వ. అంత.98
క. బాహుప్రహరణు లై యతి, సాహసికులు యదుకిశోరసత్తములు రిపు
     వ్యూహశతంబుల నత్యు, త్సాహంబునఁ గూల్చు డద్భుతం బయ్యె నృపా.99
వ. ఆసమయంబున నమ్మహానుభావుల విక్రమంబుల కనుగుణంబులుగా నమరప్రేర
     ణంబున.100
మ. చనుదెంచెన్ దివినుండి యాయుధము లాశ్చర్యప్రభాధుర్యముల్
     ముని గీర్వాణపరంపరావిహితసమ్మోదంబు లున్మాదిహృ
     ద్దనుజేంద్రక్షతజార్ద్రరూపములు మాద్యద్భూతబేతాళకీ
     ర్తనకల్యాణవిధిప్రసిద్ధబహుసంగ్రామంబు లుద్దామముల్.101
వ. అమ్మహాసాధనంబులకుం దగునట్లుగా వారికిం బూర్వంబు లగు నిజదివ్యాకారం
     బులు నుదారంబు లై పొందె నప్పుడు సుదర్శనశార్ఙ్గకౌమోదకీనందకంబులు
     గోవిందుండును సౌనందసంవర్తకంబులు సబాణబాణాసనంబులుగా బ్రలంబ
     వైరియుం బరిగ్రహించి రనంతరంబ యనంతాంశసంభవుండు సంరంభవిజృంభితం
     బగు బాహుమండలంబు చండశస్త్రోజ్జ్వలం బై దంష్ట్రాకరాళం బగు [1]ఫణివక్త్రంబు
     కరణిం దేజరిల్లఁ గడంగి.102
ఉ. చీఁదఱ రేఁగినట్లు రిపుసేనల నెల్లను ముట్టి రోఁకట
     న్మోదుచు నాఁగటం దిగిచి నొంచుచుఁ గార్ముకముక్తబాణముల్
     పైఁ దొరఁగించి కూల్చుచును బొదహతి న్నలియంగ ద్రొక్కుచున్
     లోఁ దళుకొత్తు వీరరసలోలత మోమల[2]రం జరింపఁగన్.103
మ. హరియున్ శార్ఙ్గవినిర్గతాస్త్రహతి నుద్యచ్చక్రపాతంబులం
     గరవాలప్రవిదారణంబుల మహాకౌమోదకీఘాతని
     ర్భరతం గ్రౌర్యము సూపఁగాఁ గరము సంత్రాసంబునం దూలె మో
     హరముల్ రాజసమాజముల్ దిరిగె నత్యంతంబు సంభ్రాంతితోన్.104
వ. ఇట్లు సమరపరాఙ్ముఖు లయి తనవెనుక కొదిగినవారిం జూచి జరాసంధుం
     డి ట్లనియె.105
తే. వాహనము నెక్కి కైదువువలను మిగులఁ, బట్టి మొనతల నెంతయు భయరసంబు
     గదిరి [3]పట్రించు నృపులకుఁ గలుగు భ్రూణ, హత్యఁబోలుపాపం బని రాదిమునులు.106

  1. ఫణాచక్రంబు
  2. రింప నొప్పుచున్; రింపఁగా వెసన్
  3. పట్టించు