పుట:హరివంశము.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

హరివంశము

     వైనతేయుఁడు వోరి వాని భంజించి యమ్మేటివస్తువు గొని మింటిమీఁదఁ
     జనుదెంచుచును [1]మహాశైలశృంగస్థితు నయ్యాదవేంద్రు నింపమరఁ గాంచి
తే. యతనిమౌళి యనాసాద మగుట సూచి, యాతఁ డేమి యీతం డేమి యనుచు భక్తి
     నొయ్య నది యం దమర్పఁగ నొప్పిదంబు, కరముమిగిలె నద్దేవు నాకారమునకు.73
వ. దానికి సంతసిల్లి సర్వార్థవేది యగు నయ్యారిమజన్ముం డగ్రజన్మునకుం దత్ప్ర
     కారం బెఱింగించి గరుడుని భక్తియుక్తికి నుపలాలించి యి ట్లనియె.74
శా. నీకు న్నాకు నలంక్రితక్రియాకలనముల్ నెమ్మిం బ్రయోగించి యు
     త్సేకం బిమ్మెయి నావహించు టరయన్ సిద్ధంబు కార్యార్థులై
     నాకావాసులు వేగిరించెదరు నానావైరిభూనాయకా
     నీకధ్వంస మొనర్చి మాన్పవలయున్ వేగంబ భూభారమున్.75
వ. ఇవ్విధంబున కనుకూలంబుగా నిప్పుడు.76
సీ. అదె పేర్చి వీతెంచె నంబుధరధ్వానశంఖారవోరునిస్సాణరవము
     లదె కాననయ్యెడు నతిసాంద్రసంధ్యాపిశంగసర్వంసహాచలితరేణు
     వవె యుల్లసిల్లెడు నాతపత్రదుకూలసం[2]చలితోజ్జ్వలోచ్ఛ్రయపతాక
     లవె క్రాలుచున్నవి వివిధసైనికకరాకల్పితాయుధమయూఖవ్రజంబు
తే, లాజరాసంధుఁ డస్మదీయానుపథము, నందు సకలభూనాథసైన్యప్రతతులఁ
     గొనుచు నిట వచ్చెఁ గ్రూరమై ఘోరమృత్యు, వకట పెక్కండ్రఁ గేరించునయ్య యిట్లు.77
క. మనమును సన్నద్ధులమై, పనివడి ప్రత్యర్థిచేత వార్చి నిలుత మిం
     దనుచుండ నొకముహూర్తం, బున మిన్నును దెసలు నొక్కమోతగఁ బెలుచన్.78

జరాసంధుఁడు సైన్యంబులతోడఁ గృష్ణబలరాము లెక్కిన పర్వతంబు చుట్టి విడియుట

మ. కరియూథాచలఘోటకోర్మి [3]రథకౌఘద్వీపయోధాంబుని
     ర్భరశస్త్రాస్త్రతిమింగిలప్రకరఘోరంబై నృపానీకసా
     గర ముప్పొంగి కడంగి వచ్చి సముదగ్రం బైనయాశైలముం
     బరివేష్టించెను మేరువుం బొదువుకల్పచ్ఛేది తోయంబనన్.79
వ. అమ్మోహరంబుల కన్నిటికి ముంగల యై జరాసంధుసేనాపతి యేకలవ్యుం డతి
     వ్యగ్రం బగు [4]సమరోత్సాహంబున నుగ్రుం డై యే నొక్కరుండన గోపాల
     బాలుర నిద్దఱం దునిమి తూఁటాడెద నెవ్వరు నేల యని యేలికముందటఁ బంతం
     బులు పలుకుచు నలఘుస్యందనంబునం దమందమార్గణబాణాసనకృపాణాదిపరి
     కరంబులు నతిశయిల్ల విజృంభించె నంత.80

  1. దుర్గ
  2. స్వరీతోధ్వజో
  3. రథపూగ
  4. సమరాగ్రంబున