పుట:హరివంశము.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

హరివంశము

వ. ఏను బోయి వచ్చెద నని పరశురాముండు పరమసౌహార్దలాభప్రముదితుం డై
     ప్రమోదమధురహృదయు లగు నాసదయశరీరులు సగౌరవంబుగా వీడ్కొలుప
     నిజస్థానంబునకుం జనియె నట్లు జామదగ్న్యుం డరిగిన యనంతరంబ.53
శా. శ్వేతశ్యామశరీరు లాబలుఁడు రాజీవాక్షుండుం దద్దయుం
     జేతోమోద మెలర్పఁ దన్నగమహాశృంగంబునన్ రిక్తపూ
     ర్ణాతివ్యక్తపయోధరద్వయమున ట్లయ్యైప్రదేశంబులన్
     జాతౌత్సుక్యమనస్కులై మెలఁగి రిచ్ఛాకల్పితక్రీడలన్.54
సీ. కిన్నరమిథునోపగీతకుంజంబులు పంచాస్యహుంకృతిస్ఫారగుహలు
     చారణద్వంద్వసంచారచారుస్టలంబులు మధుపాఘ్రాతపుష్పలతలు
     గంధర్వదంపతీక్రాంతనిర్ఝరసైకతములు మాద్యత్కుంభిదళితతరులు
     సిద్ధకుటుంబసంసేవ్యసానువులు సారసవధూభుక్తసరస్తటములు
తే. లోనుగాఁగ నపూర్వవిలోకనీయ, భూము లాలోకనీయవిస్ఫూర్తిఁ జేయ
     [1]నెలమి నయ్యిద్దఱును జరియించుచుండ, వరుసతోఁ గొన్నిదివసంబు లరుగుటయును.55
వ. ఒక్కనాఁడు బలదేవుం డొక్కరుండు నొక్కయెడ వనవిహారఖేదంబు నొంది
     ఘర్మాంతసమయసంపుల్లమంజుమంజరీకరందమదకకలరోలంబకదంబకం బగు కదంబ
     కంబు గని తదీయతటంబున.56
మ. సెలయేఱు ల్గడలొత్తం జేయుచు లతాసీమంతినీనర్తనం
     బులు గల్పించుచు మత్తబర్హిరుతముల్ పొల్పొందఁగా జేయుచున్
     వలనై కాననమారుతంబు దనకు వాంఛానురూపంబుగా
     నలఘుస్వేదవినోదనం బొసఁగఁగా నాసీనుఁడై యిమ్ములన్.57
తే. పెల్లుగాఁ దృష యొదవినఁ బెదవు లెండ, నమ్మహీరుహమధురసం బాత్మఁ గోరి
     కొమ్మ దిగువంగ నపుడు తత్కోటరమున, నధిక[2]దీప్తిగంధోత్కటవ్యాప్తి యగుచు.58
వ. కదంబజాత యగుటం గాదంబరి యనుపేర నతిమనోహర యగురసధార దొరఁగినం
     బ్రియంబు మిగుల నది యాస్వాదించి యమ్మహాప్రభావుండు.59
క, మద మొయ్యన యెక్కఁగఁ గెం, పొదవెడు[3]నేత్రములు ఘూర్ణితోజ్జ్వలములుగా
     బొదలఁగ నంగములు వివశ, హృదయుండై యున్నయెడ సమాహితభంగిన్.60
వ. మదిరాదేవి సాకారయై ముందర నిలిచి కేలు మొగిచి యి ట్లనియె.61
చ. అమృతముతోడఁ దొల్లి వరుణాత్మజనై జనియించి వారుణీ
     సముచితనామధేయమున సర్వమునం బెనుపొందు నాఁటికా
     లమునను నీకుఁ గాంతనయి మానితవిక్రమ నేఁడు దండ్రిపం
     పమరఁగఁ బూని యిచ్చటఁ బ్రియంబున నిన్ను వరింప వచ్చితిన్.62

  1. నెలమి నయ్యరువురును జరించు
  2. దివ్య
  3. నయనములు ఘూర్ణ నో