పుట:హరివంశము.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 1.

243

క. అమరుల కైనదురారో, హము కాంచనరత్నమయమహాతటముల న
     య్యరకమహీధరసమరుచి, నమరు నమేయప్రభావ మది మధుమథనా.44
సీ. అక్కజం బౌనట్టి యమ్మహానగము నుదగ్రశృంగముఁ బ్రాఁకి యచటనుండి
     చూచినఁ జంద్రుఁడు సూర్యుండుఁ దారలు నుదయాస్తమయముల నొందునెలవు
     లనతిదూరంబు లైనట్లుండు [1]బెరసి యంతర్ద్వీపసహితమై తగఁ బయోధి
     గానఁగ నగు నందుఁ గడువేడ్క మీ రుండఁ జనుదెంచి యాజరాసంధనృపతి
తే. శైలయుద్ధకోవిదులును సారబలులు, నయినమీతోడి పెనఁకువయందు వెరవు
     సాల [2]కపజితుఁ డై పోవు సర్వభంగి, నధికజయసిద్ధి యగు మీకు ననఘులార.45
వ. మఱియు నమ్మహాసమరంబునఁ జక్రశార్ఙ్గంబులు గౌమోదకి యను గదయు సౌనంద
     సంవర్తకంబు లను ముసలలాంగలంబులును సన్నిహితంబు లయ్యెడు నాత్మీయంబు
     లగు పురాణదివ్యరూపంబులు ధరియించి (మీరు) వైరులకు భయంకరు లయ్యె
     దరు యాదవులకు మాగధపురస్సరు లగు ధరణీపతుతోడ రణం బగు నని
     మున్ను దేవాదేశంబు గలదు. గావున భూభారావతరణంబునకుఁ గారణం బగు
     భారతరణంబు నీవ ప్రవర్తింపఁ గాలక్రమంబునం గాఁగలయది యనిన భృగు
     సూనుభాషితంబులకుఁ బరితోషంబు నొంది రమ్మహాతేజుండు [3]మున్నుగా మూఁ
     డగ్నులుంబోలెఁ బ్రదీప్తు లై కదలి కతిపయప్రయాణంబుల నరిగి ముందట.46

శ్రీకృష్ణబలరాములు పరశురామసహితంబుగా గోమంతంబుం జేరుట

క. ధీమంతు లంతఁ గాంచిరి, గోమంతము విపినకుసుమకుంచితశబరీ
     సీమంతము నిర్ఝరకణ, హేమంతము గనకమణిమహీమంతంబున్.47
క. [4]ఆమద్రీంద్రునిశిఖరం బాయతభుజావధికరయసమగ్రతఁ బక్షీం
     ద్రాయితగతి నెక్కి యొకమ, హీయస్స్థలి నెలవుగాఁగ నింపెసలారన్.48
వ. ఉన్నంత జమదగ్నినందనుండు గోవిందు ననేకవిధంబుల స్తుతించి యనంతరంబ
     యి ట్లనియె.49
క. ఇదె కొండ యిందు రమ్మని, ముదమున నొకనెపము పెట్టి మునిసుతు లగుమీ
     హృదయము వడసితిఁ గేశవ, యిది యించుక తలఁపుమయ్య యెప్పుడుఁ గరుణన్.50
మ. భువనక్షేమనియుక్తికై యదుకులాంభోరాశిపూర్ణేందువై
     భవ మొప్పార జనించి మానుషకృతిం బ్రచ్ఛన్నమై నైజభూ
     తివిశేషం బిల నల్పబుద్ధులకు బోధింపంగ [5].రా కిట్టు లు
     న్నవిభు న్నిన్ను భజించుధీరులు గడున్ ధన్యుల్ సరోజేక్షణా.51
తే. వైనతేయునిఁ దలఁపుము వాహనంబుఁ, [6]గేతువు నతండునై నీకుఁ బ్రీతిసలుపు
     నప్రమత్తుల రగుఁ డింక నావిపక్షుఁ, రాకఁ దెలిపెడు బహునిమిత్తాకలనము.52

  1. వెలసి
  2. కపహతుఁడై
  3. మొదలుగా
  4. ఆయచలేంద్రుని
  5. నాకిట్లు; రాకెట్లు యాదవుల న్నిన్ను
  6. గేతువును నైనయాతఁడు సంప్రీతి