పుట:హరివంశము.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వ భాగము - ఆ. 9.

235

వ. ఇట్లు క్రమంబున సముద్రదండధరమృత్యువుల సాధించి పాంచజన్యపూర్వకం
     బుగా గురుపుత్రుం బడసి యరుగుదెంచి యా జగద్గురుడు గురువునకు సమర్పించిన.211
శా. తా నాశ్చర్యరసంబులో మునిఁగి గాత్రం బాత్తరోమాంచమై
     యానందాశ్రులతోడ భూసురవరుం డాత్మోద్భవుం గేశవున్
     శ్రీ నిండారఁగ నొక్కకౌఁగిటన యర్థిం జేర్చే యాశీర్వచో
     దానాభ్యర్చితుఁ జేసె వేవిధుల నాత్రైలోక్యసంపూజితున్.212
క. గురుదక్షిణ యిమ్మెయిఁ గడు, నరుదారఁగ నొసఁగి కృష్ణుఁ డన్నయుఁ దానున్
     గురునొద్ద వెండియు గదా, పరిఘాద్యాయుధకళానుభవతత్పరతన్.213
వ. కతిపయదివసంబులు వసియించి యమ్మహాత్ము వీడ్కొని మధురాపురంబునకుం జను
     దెంచె నిట్లు సకలవిద్యాభ్యాసపారీణు లైన వారిరాకకుఁ బురంబు సర్వాలంకార
     సమేతంబు గావించి.214
సీ. వారువంబుల మేటితేరులఁ బొలుపారు నేనుంగులను నెక్కి వేనవేలు
     భంగులఁ గైసేసి బాంధవు లయ్యుగ్రసేనుండు మున్నుగాఁ జెన్ను మిగుల
     మాన్యపురోహితమంత్రిసామంతసీమంతినీపౌరసమస్తభృత్య
     సూతమాగధవందివైతాళికానేకజనసంకులస్ఫూర్తి సంఘటించి
తే. శంఖదుందుభినిస్సాణసరసగాన, నర్తకోత్సవసంభృతానందలీల
     నెదురుకొని తోడి తెచ్చి [1]రయ్యిద్ధయశులఁ, బ్రియము లొండొండ నిండారి బయలువెడల.215
శా. ఉల్లంబుల్ వికసిల్ల మందపవనుం డుద్గంధియై వీచె వ
     ర్తిల్లెన్ భానుఁడు మేఘముక్తవిసరద్దీప్తిప్రతానంబుతో
     నుల్లాసంబు వహించె వహ్నులు విధూమోద్యచ్ఛిఖాశ్రేణి శో
     భిల్లెం బెల్లుగ వాసుదేవుని పురాభిప్రాప్తివేళం దగన్.216
ఉ. ఆతతరాగవేగమున నచ్యుతుచేత సనాథమై వికా
     సాతిశయం బెలర నెలరారె సమస్తపురంధ్రిపూరుష
     వ్రాతము గోగజాశ్వము లవారణఁ బ్రస్ఫుటచేష్టలం [2]బ్రమో
     దాతతహర్షముం దెలిపె నప్పురి యప్పరమోత్సవంబునన్.217
క. లలితాయతనంబులలో, నలఘుసమభ్యర్చనముల నంది తనరువే
     ల్పులప్రతిమలును బ్రసన్నత, కలిమి యెఱింగించె భద్రకాంతిశ్రీలన్.218
క. దీనుఁడు వికలుఁడు జడుఁ డవ, మానితుఁ డాతురుఁడు లేఁడు మధురాపురి నే
     మానవుఁడును గృతయుగసమ, యానుకృతిం బొలిచెఁ దత్సమయ ముజ్జ్వలమై.219
వ. అట్టియవసరంబున.220

  1. రయ్యిద్దఱను బ్రియంబులందంద నిండారి యలపులెడల
  2. బ్రమాణాతిగ