పుట:హరివంశము.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

హరివంశము

మ. అని యుత్తుంగతరంగహస్తములఁ గ్రూరారాతిఁ దీరస్థలం
     బునకుం దెచ్చిన నవ్విభుండు ప్రసభస్ఫూర్జత్కృపాణాహతిన్
     దనుజున్ వ్రచ్చి గతాసు భూసురసుతుం దత్కుక్షిలోఁ గాన కా
     ఘనసత్త్వంబు శరీరజం బయినశంఖం బొప్పుతో నుండినన్.200
వ. అప్పుణ్యవస్తువుం బ్రియంపడి పుచ్చుకొని తనకుం జిందం బగు నని పరిగ్రహించె
     నద్దేవుం డొనర్చిన నామంబునఁ బంచజనజనితం బగుట నది పాంచజన్యం బన
     నమరాసురమనుష్యలోకంబులఁ బ్రసిద్ధినొందె ననంతరంబ యతండు.201
క. చచ్చినపిమ్మట నెటువో, వచ్చు జముఁడ కాక యెల్లవారికి గతి యే
     నచ్చట నతనిం బట్టఁగ, నచ్చుపడెడిఁ గర్జమెల్ల నని కడుఁ గడఁకన్.202
వ. దక్షిణదిశకుం జని దక్షిణాధీశ్వరుపురంబు సొచ్చి యాసనస్థుం డైనయాసూర్య
     సూనుం గని రోషసంరక్తలోచనుండై నీ వస్మదాచార్యుం డైనసాందీపనికొడుకుం
     దెచ్చినవాఁడవు క్రమ్మఱ రమ్మన నతని నొప్పింపు మొప్పింపక యొప్పనిపనికిం
     జొచ్చితేని నెచ్చటు సొచ్చియు బ్రదుకనేర్చినవాఁడవు గావులు మ్మనిన వడంకుచు
     లేచి నిలిచి విరచితాంజలి యై వైవస్వతుండు.203
తే. పూని సర్వజంతువులను బుణ్యపాప, గతులఁ బుచ్చుట కొకటికే కర్త నేను
     బ్రాణహరణంబు మృత్యువుపని మహాత్మ, తెచ్చె గురుసుతు మృత్యువు దెల్ల మింత.204
వ. దీని నవధరించి నన్ను రక్షింపు మనిన నప్పరమేశ్వరుండు.205
శా. ఏమీ మద్గురుపుత్రుఁ దెచ్చుటయ కా కిబ్భంగినేఁ గ్రుమ్మరం
     గా మాదుఃఖ మొకింతయుం గోన కహంకారంబు పూరించెనే
     వామాచారుఁడు మృత్యు వన్ ఖలుఁడు సావం గోరెఁ గా కేమి యు
     ద్దామక్రోధకృశాను నింకఁ బనుతుం దన్మూలసందాహిగాన్.206
వ. అని పలికి సజ్యం బగుశరాసనంబు దృఢముష్టి నమర్చి విశిష్టం బగుదివ్యబాణంబు
     గైకొనిన నమ్మహానుభావు భవ్యవిభూతికి భీతిం బొంది యత్యంతరయంబున
     మృత్యువు తద్గురుకుమారుం బునరాత్తశరీరుం జేసి తెచ్చి.207
క. వినయగ భీరతలోపలఁ, దనతప్పంతయు నడంగఁ దనుజదమనుచెం
     త నివేదించినఁ దగఁ గై, కొని విభుఁ డనుమోద మాత్మఁ గూరఁగ మరలన్.208

శ్రీకృష్ణుఁడు సాందీపనికి మృతపుత్రుని గురుదక్షిణగాఁ దెచ్చియిచ్చుట

వ. అట్టి మహాప్రభావం బనుసంధించి.209
చ. చిరమృతుఁడై యమక్షయముఁ జెందినవిప్రసుతుండు క్రమ్మఱన్
     సురుచిరపూర్వదేహపరిశోభితుఁ డయ్యె నశక్య మప్రత
     ర్క్యరచన మద్భుతం బసుకరం బొరులెవ్వరి కిట్టిచేఁత యం
     చురుఫణితి న్నుతించె హరి నోలిన సర్వసురాసురాళియున్.210