పుట:హరివంశము.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

హరివంశము

వ. అప్పుడ రంగస్థలమంచకప్రకరం బెల్ల నల్లలనాడం బుడమి వడంకె జనంబుల
     చూడ్కులు విన్నఁదనంబు నొందె దెసలు మండెఁ గంసోత్తంసంబునం బ్రధాన
     రత్నంబు భ్రష్టం బై పడియె మఱియుఁ బెక్కుదుర్నిమి త్తంబులు దోఁచె న ట్లతి
     పరిక్షీణప్రాణుం డైనచాణూరుం బొదివి యయ్యదుకుమారవీరుండు ఘోర
     ముష్టిం దన్మస్తకంబు నడుకొనం బొడిచి యెగసి మ్రోకాల నురంబు దాటించె
     నట్టిబెట్టిదంపుఁజేతవలన గ్రుడ్లు వెలికుఱికి పండ్లు దెఱచి నోర ముక్కున నెత్తు
     రులు వెడలి వాఁడు కులిశపాతభగ్నం బైనశైలశృంగంబుభంగిం బడి వికృ
     తంబుగా నొఱలుచు విగతజీవుం డయ్యె నటమున్న.132
క. బలుఁడును ముష్టికుతోడం, దలపడి యమ్మైన పెనఁగి దారుణముష్టిం
     దల గ్రుంగఁబొడిచి వానిం, బొలియించెం గృష్ణసదృశభుజచేష్టితుఁ డై.133
వ. ఇవ్వెధంబున జాణూరముష్టికుల వధియించి రంగతలం బంతయుం దార యై రామ
     కృష్ణు లిద్దఱుం గ్రోధసంరక్తలోచనంబులఁ గంసుదెసఁ గనుంగొనునప్పు డప్పూఁ
     పునకుఁ గంసక్రౌర్యంబునకు నందగోపాదు లగుఘోషజనంబు లందఱుం దల్ల
    డంబుల నందంద మేనులు వడంక నొక్కదెస సుడిగి మునిగి యుండిరి. తక్కిన
     వారునుఁ బుల్లపడి చూచుచుండి రంతఁ134
సీ. మును గన్ననాఁడ [1]దవ్వునఁ బాఱవైచినపట్టిఁ గ్రమ్మఱ గన్నభంగిఁ గనియు
     నంతకప్రతిరూపుఁ డైనచాణూరుదోర్బలము వితర్కించి బ్రదుకు సమ్మ
     కురుబాష్ప[2]నేత్రయై యుసుఱు తల్లడిలంగ నున్నదేవకి యెట్టు లుగ్రభంగిఁ
     బగతునిఁ బరిమార్చి బలితుఁ డై తనకు మా ఱెందును లేక యుదీర్ణతేజ
తే. మమర వెలుఁగునాకృష్ణు లోకాభిరామ, మూర్తిఁ గనుఁగొని వాత్సల్యముగ్ధహృదయ
     యగుచుఁ జన్నులు చేఁపంగ హర్షశీత, లాశ్రువులు కన్నుఁగొనల నిండార నలరె.135
మ. వసుదేవుండును బుత్రు నూర్జితభుజావష్టంభసంభావనా
     రసికుం బాతితశాత్రవుం బ్రముదితభ్రాత్రన్వితుం జూచుచున్
     వెస నానందరసానుభూతివలనన్ సిద్ధుండ పోలెన్ జరా
     వ్యసనం బేమియు లేక యత్తఱిఁ గుమారాకారుఁ డయ్యెన్ మదిన్.136
ఉ. కంసునికొల్వువా రయినకామిను లెల్లను గృష్ణమూర్తి యా
     శంసదలిర్ప ఱెప్పలిడఁ జాలక చూడ్కులు గొల్పుచున్ సభన్
     గంసునియున్కియున్ బహుముఖంబులమల్లులపోరుఁ దద్రిపు
     ధ్వంసము లోనుగా నొకవిధంబు నెఱుంగర త మ్మెఱుంగమిన్.137
వ. అట్టియెడల బ్రతిభటనిపాతనంబున నాతతోత్సాహు లై యాహవక్రియాదోహ
     లం బెక్క నుక్కుమీరి మాఱులేక మలయుచు విలయకాలశిఖి(శిఖా)సంకాశు

  1. తప్పున
  2. కంఠివై