పుట:హరివంశము.pdf/269

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 9.

221

ఉ. కంసునిబాధలం బడుజగంబుల కింతటవేగుఁగాక త
     ద్వంశము వేగ వేగుటయుఁ దా నొడఁగూడదె యన్గతిం దమో
     ధ్వంస మొనర్చి శౌరి కనుదమ్ములు తమ్ములచాయ నవ్వఁగా
     హంసుఁడు ప్రాచ్యపర్వతశిఖాగ్రవతంసత నొందె నొప్పుగాన్.87

కంసుండు సపరివారుం డై రంగస్థలంబున నుండి రామకృష్ణుల రావించుట

వ. పురంబున నెల్లవారును, గైసేసి రాజశాసనంబున రామకృష్ణులపరాక్రమం
     బాలోకించు కౌతుకంబున నుల్లంబులు పల్లవింపం జనుదెంచి నిజోచితంబు లగు
     మంచప్రకరంబు లెక్కి చూచుచుండిరి రాజును సమస్తపరిజనంబులతోడ నుత్తుంగ
     కనకాసనసనాథం బైనమంచకస్థలంబున నాసీనుం డై ధవళాంబరంబులు ముక్తా
     మయభూషణంబులు వెలిగొడుగులు వింజామరంబులు విలాసినీనివహసితాపాంగ
     రోచులు నొక్క తెలువై పొలుపారం జంద్రోదయోద్దామసౌందర్యంబు నభిన
     యించుచుండె విచిత్రంబు లగు తెలిచీర లిరుదెసల నుల్లసిల్ల నమ్మేటితమగంబులు
     బలుఱెక్కలతోడి పెద్దకొండలకైవడిం గనుపట్ట నంతఃపురజనంబులును జగతీ
     విభుని యిరుగెలంకులను వెనుకదిక్కునను మెఱయు మంచలపై నుండి గవాక్ష
     ప్రసారితంబు లగునిరీక్షణంబుల నయ్యుత్సవం బభినందించిరి. దివంబున
     నుండి దేవేంద్రుండు దేవగణసమేతుం డై జీమూతమాతంగంబుమీఁద నొప్పారి
     నారదప్రముఖమునివరులను దిలీపప్రభృతిపూర్వభూపతులును సిద్ధయోగిసము
     త్కరంబులుం గొల్వఁ గంసధ్వంసనావధి యగురిపువధకల్యాణంబు గనుంగొను
     వాఁడై యరుదెంచి యంబరకలంబు బహువిమానసుందరంబు గావించె నంత.88
క. కచ్చించి మల్లులిద్దఱు, మచ్చరమున లావు మెఱయ మత్తకరులు రెం
     డిచ్చఁ జనుదెంచుచాడ్పున, నచ్చటి కేతెంచి నిలిచి రధిపతియెదురన్.89
క. శూరుఁ డగుమహామాత్రుఁడు, వారక మదతీవ్రదుష్టవారణము నృప
     ద్వారమున నిలిపి యాడవ, దారకుల న్వార్చియుండెఁ దద్దయుఁ గడఁకన్.90
వ. ఆ సమయంబున.91
చ. అడవులనుండి వచ్చిరఁట యద్భుతశౌర్యులు రామకృష్ణు లి
     క్కడికి న రేశ్వరుండు గడుఁగౌతుకియై పిలుపించెఁ దోడి తెం
     డెడమడు వేల యింక నఖిలేచ్ఛలుఁ జేకుఱు నంచుఁ గంచుకుల్
     బడిబడిఁ బాఱుతెంచి తమభావ మెలర్పఁగఁ బల్కి పిల్వఁగన్.92
క. ఒకసంభ్రమమును లేక, య్యకలంకాత్మకులు తొంటియట్టుల మూర్తుల్
     వికృతిరహిత లయి జనదృ, క్చకోరకముల కభినవేందుసదృశత నమరన్.93
వ. రంగద్వారంబు సేరి రప్పుడు బోరనం జెలంగువాదిత్రంబుల విచిత్రధ్వానంబులును
     బ్రేక్షకవ్రాతంబుల కౌతూహలాలాపఘోషంబులు దివంబున దివ్యదుందుభినిన
     దంబును దదంతరంగంబులకు సముత్సాహతరంగంబులు సమధికోత్తుంగంబులు