పుట:హరివంశము.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

హరివంశము

క. అని యి ట్లెంతయు సన్మా, నన మొప్పారంగఁ దమ్ము నరపతి ప్రార్థిం
     చినఁ బ్రార్థనీయబాహా, ఘను లగువా రతనియెదుర ఘటితాంజలు లై.58
చ. పలుకులు వేయు నేమిటికిఁ బార్ధివకుంజర యిట్టినీవు మా
     కొలఁది యెఱింగి పంచెదవు గోపకిశోరులు మాకు నగ్గమై
     యెలసినయప్డ పైఁబడుదు మించుక సైచి పెనంగ నోపినన్
     నిలువక బీఱువోయినను నీవ కనుంగొనఁ గూల్తు మిద్దరన్.59
క. ఇది యొకపనిగా దేవర, మదిలోఁ జింతింపవలదు మా కెదురుగ నీ
     యుదధివృతధాత్రి మల్లుల, వెదకియుఁ గానము భుజింపు విశ్వశ్రీలన్.60
వ. వార లిట్లనిన సంప్రీతుండై యతండు వారికి రంగభూమి యందుఁ బేర్కొనం గల
     తమగంబులు సూప నాజ్ఞాపించి నేటికి నిజగృహంబుల కరుగుం డనినం బెలుచన
     బాహువు లాస్ఫాలించి సింహనాదంబు చేసి మ్రొక్కి వీడ్కొనీివారు యథేష్ట
     గమనం బొనర్చిరి తదనంతరంబ కంసుండు గజారోహణనిపుణుం డగు [1]మహా
     మాత్రు రావించి యి ట్లనియె.61
క. నిను నెంతయు నాప్తునిఁగా, మనమున నే విశ్వసింతు [2]మంత్రివర తగం
     బని సాలఁ గలిగె నిప్పుడు, వినవలసినతెఱఁగు వినుము విస్పష్టముగాన్.62
ఉ. గొల్లలలోపలం బెరిఁగి గొల్లతనంబ యెఱింగి యెంతయుం
     బ్రల్లదు లైనవారు గడుఁ బాతకు లావసుదేవుపుత్రకుల్
     బల్లిదు లిప్పు డిచ్చటికిఁ బన్నుగ వచ్చినవారు వారికిన్
     మల్లులఁ బంచితిం గఠినమర్దనశౌండులఁ గీడొనర్పఁగాన్.63
వ. నీవును సన్నద్ధుండ వై యారామకృష్ణులు సనుదెంచు సమయంబునకు ముందట.64
మ. పెలుచం గుంజరరాజము న్గువలయాపీడంబుఁ గ్రోధానలా
     కులఘోరాక్షము గండమండలపరిశుభ్యన్మదస్రోతమున్
     బలవద్వీరవిదారణప్రకటితాభ్యాసంబు నాసన్నమై
     యెలయన్ రాజగృహంబువాకిటికి రాని మ్మోపి యీవేకువన్.65
తే. ఖలుల విగతాయుధుల వారిఁ గనినయపుడ, వారణము గొల్పుమీ వరవాయి గొనక
     జమునిపట్టినచెరగాక సడలిపోవ, వచ్చునే దానియెదుర నెవ్వారికైన.66
ఉ. ఏనుఁగుచేతఁ జిక్కి యొకయింతయుఁ జేయఁగలేక ధాత్రిపైఁ
     బీనుఁగులై వెసంబడినబిడ్డల నవ్వసుదేవుఁ డెంతయున్
     దీనతఁ గాంచి తాను దనదేవియు వెండి నశింతు రాఫ్తులై
     వానికిఁ బూనివచ్చుయదువర్యులు ద్రుంగుదు రొయ్య నందఱున్.67
క. నీనేరుపొండె మల్లుల, పూనికయొండె నిటుపగఱఁ బొరిపుచ్చిన నే
     నీనిఖలజగము యదుగణ, హీనముగాఁ జేసి యొకఁడ నేలుదు నెమ్మిన్.68

  1. మహామాత్యు
  2. సుత్తిపర