పుట:హరివంశము.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

హరివంశము

     న్నలరెడు నిమ్మహాత్మునిసమంచితశైశవముం గ్రమంబుతో
     విలసితదృష్టియం దనుభవించినయాజను లెట్టిధన్యులో.135
తే. అయ్య శ్రీకృష్ణ యిందు రమ్మనుచు బోయి, కౌఁగిలింతునొ యటుగాక కమలనాభ
     యాదిపూరుష యచ్యుత యని ప్రణామ, మాచరింతునొ రెండుగృత్యములు నాకు.136
వ. అనుచుఁ దదీయదివ్యరూపంబు నిరూపించి నిర్నిమేషంబు లగువీక్షణంబులతోడ.137
సీ. గోపికానయనచకోరపూర్ణేందు వివ్వదనంబు మధురవాగ్వైభవంబు
     లక్ష్మీస్తనాభోగలాలితం బిమ్మహావక్షంబు శ్రీవత్సలక్షణంబు
     దైత్యనిర్మథనదుర్దాంతదివ్యాయుధార్హంబు లీభుజము లత్యాయతములు
     త్రైలోక్యనిత్యశరణ్య మీచరణద్వయంబు నిసర్గరక్తాంగుళీక
తే. మీతనికె కాక యమరునే యిత మూర్తి, కీలసన్మేఘ సమవర్ణుఁ డీసుపర్ణ
     పర్ణవాసుఁ డీకౌస్తుభోదీర్ణహారుఁ, డచ్యుతుఁడు సర్వదేవతాభ్యర్చితండు.138
క. మునుమున్న కాదె యార్యులు, వినుతనిజజ్ఞానదృష్టి విధిఁ దిరముగఁ గ
     న్గొని కడకట్టినవా రీ, తనియీదృశభావచేష్టితము లఖిలములున్.139
వ. ఈ నారాయణదేవుం డాదేవాదిచతుర్విధభూతహితంబు గోరి దేవకీగర్భంబున
     నావిర్భవించి వసుదేవప్రయత్నంబునం బెరిఁగి వ్రేపల్లె నుల్లసితబాల్యయావన
     విజృంభితంబు లగువిహారంబులు గ్రమంబున నాదరింపం గలవాఁడు తొల్లి బలి
     యడంచి బలసూదనునకుం ద్రైలోక్యాధిపత్యం బొసంగిన[1]కరణిఁ గంసుని వధియించి
     యుగ్రసేనునకు రాజ్యం బిచ్చి తాను రాజు గానొల్లక యుండెడు నఖిలరాజ
     న్యులు ననన్యసంశ్రయు లై తనశాసనం బొనర్ప దర్పంబున నాత్మీయవంశ్యు
     లెవ్వరిం గైకొనక పృథ్వి యంతయుం దార కైకొని కులంబు వెలయింతు రిది
     యంతయు నేను మహాత్ములవలన వింటి నిమ్మహాదేవునకు నభివందనపూజాస్తో
     త్రాదులు పవిత్రనిష్ఠ ననుష్ఠించి బగుభద్రంబు నొందెద.140
ఉ. ఈతనియట్ల సత్కృతుల కెల్లను బాత్రము రాజతాద్రితు
     ల్యాతతశుభ్రదేహుఁడు మహాభుజుఁ డీబలభద్రుఁ డప్రతీ
     ఘాతము లైనవిక్రమవికాసములం దనభూతభావిలీ
     లాతతి నుజ్జ్వలంబుగ నలంకృతి సేసినవాఁడు మేదినిన్.141
క. శ్రుతవంతు లైనవిప్రులు, శ్రుతివిధులం జొచ్చి యరసి చూచియెఱిఁగి రు
     ద్ధృతమతులై యివ్విష్ణుని, యతర్కితానేకవిస్మయావహమహిమల్.142

అక్రూరుండు వ్రేపల్లెకు వచ్చి శ్రీకృష్ణుని దర్శించుట

వ. అని తలంచుచు ససంభ్రమగమనంబునం జని గోపాలదేవ శ్రీపాదపద్మంబు
     లకు నిజగోత్రనామసముచ్చారణపూర్వకంబుగా బ్రణామంబు సేసినం బ్రీతుం
     డై యెత్తి కౌఁగిలించికొని యప్పరమేశ్వరుండు కుశలం బడిగి బలదేవసహి

  1. పగిది